Site icon NTV Telugu

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

జగదీప్ ధన్‌కర్ అనూహ్యంగా జూలై నెలలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఊహించని రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. అనూహ్య నిర్ణయంపై అనేక ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ధన్‌ఖర్ రాజీనామా చేశారంటూ విపక్ష నాయకులు ఆరోపించారు. ఇక ఆయన ఆచూకీ కనిపించకపోవడంతో కూడా రకరకాలైన కథనాలు వెల్లువడ్డాయి. మొత్తానికి రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో అనుమానాలు తొలగిపోయాయి.

ఇది కూడా చదవండి: Machado: నోబెల్ శాంతి గ్రహీతకు కొత్త చిక్కులు.. అవార్డ్‌పై వెనిజులా అభ్యంతరం

మరొకసారి ధన్‌ఖర్ వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం ట్విస్ట్‌లు ఇవ్వకుండా పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చారు. భోపాల్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కనిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పుస్తకం మన గత వైభవానికి అద్దం అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ పుస్తకం నిద్రపోతున్న వారిని మేల్కొల్పుతుంది. ఇది మన సాంస్కృతిక విలువల గురించి మనకు అవగాహన కల్పిస్తుంది.’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లిన మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌కు అధికారుల నుంచి ఎలాంటి మర్యాదలు లభించలేదు. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ రాష్ట్ర బీజేపీ నుంచి గానీ ఎవరూ కూడా విమానాశ్రయంలో ధన్‌ఖర్‌కు స్వాగతం పలకలేదు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. మాజీ ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రొటోకాల్‌ను బీజేపీ పాటించడం లేదని ఆరోపించారు. బీజేపీ వాళ్లు యూజ్ అండ్ త్రో విధానాన్ని అనుసరిస్తారని వ్యాఖ్యానించారు.

 

Exit mobile version