Jabalpur Bride Gets Beautician Arrested For Messing Her Make-Up: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి కూతురుకు సకాలంలో మేకప్ చేయకుండా.. దురుసుగా ప్రవర్తించినందుకు బ్యూటీషియన్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన జబల్ పూర్ లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వివారాల్లోకి వెళితే.. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం పెళ్లి కూతురుకు మేకప్ చేయకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడింది ఓ బ్యూటిషియన్. జబల్ పూర్ నగరంలోని ఘమాపూర్ ప్రాంతానికి చెందిన వధువుకు డిసెంబర్ 3న వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆమె మేకప్ కోసం కొత్వాలి బజార్ లోని బ్యూటీపార్లర్ నడుపుతున్న బ్యూటీషియన్ ను సంప్రదించినట్లు సిటీ ఎస్పీ ప్రభాత్ శుక్లా వెల్లడించారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘన్‌లో బహిరంగంగా మరణశిక్ష.. తాలిబాన్ అధికారం చేపట్టాక ఇదే తొలిసారి
అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం బ్యూటీషియన్ పెళ్లి రోజు సకాలంలో వేదికవద్దకు వచ్చి మేకప్ వేయాలని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి అడ్వాన్సు కూడా చెల్లించారు. పెళ్లి రోజు సకాలంలో పెళ్లి మండపానికి వచ్చి వధువుకు మేకప్ వేస్తా అని బ్యూటీషియన్ హామీ ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు వధువు తరుపు బంధువులు. అయితే బ్యూటీషియన్ పెళ్లి వేదికకు రాకపోగా.. అడిగితే బ్యూటీపార్లర్ వద్దకే రావాలని కోరింది. దీంతో చేసేందేం లేక వధువు బ్యూటీ పార్లర్ కి వెళ్లింది. అక్కడ బ్యూటీషియన్ మేకప్ చేయకుండా.. తన సహాయకురాలికి మేకప్ పని అప్పగించింది. బ్యూటీషియన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు తల్లి మంగళవారం కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మేకప్ సరిగ్గా చేయకపోగా.. యజమాని దురుసుగా ప్రవర్తిస్తూ.. బెదిరించారని ఫిర్యాదు చేశారు. బ్యూటీషియన్ పై ఐపీసీ సెక్షన్లు 294( అశ్లీలచట్టం), 506( క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.