Uddhav Thackeray: కేంద ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లుని కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించడంతో, ఈ బిల్లుని చర్చించేందుకు పార్లమెంట్‌లోని 31 మంది ఎంపీలతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, తాజాగా వక్ఫ్ బిల్లుపై తొలిసారిగా శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మౌనం వీడారు. ఇది వక్ఫ్ బోర్డుల గురించి మాత్రమే కాదు, దేవాలయాల గురించి కూడా అని శుక్రవారం అన్నారు. ఆ ఆస్తులను ఎవరినీ తాకనివ్వనని వాగ్దానం చేశారు. భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీలో ఉన్నప్పుడు వక్ఫ్ సవరణ బిల్లును ఎందుకు ఆమోదించలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై కూడా థాకరే స్పందిస్తూ, నరేంద్రమోడీ హిందుత్వాన్ని వదులుకున్నారా..? అని ప్రశ్నించారు. కేదార్‌నాథ్ ఆలయంలో చోరీకి గురైన 200 కిలోల బంగారంపై శంకరాచార్య చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల వక్ఫ్ బోర్డు అంశంపై ఉద్ధవ్ ఠాక్రే మౌనంగా ఉండటంపై ఇటీవల ఆయన నివాసం ‘మాతో శ్రీ’ ముందు ఆందోళనలు జరిగాయి.
