Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!

  • రాహుల్ గాంధీకి మద్దతుగా ఇటలీ నేత నినాదాలు..
  • గతంలోనే గియాకోమో ఫిలిబెక్‌ను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్..
  • ఫిలిప్పీన్స్ అంతర్గత విషయాల్లో జోక్యంతోనే చర్యలు..
  • భారత్‌లో కూడా ఇదే తరహా చర్యలు..
  • వీసా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు సమాచారం.
Giacomo Filibeck

Giacomo Filibeck

Giacomo Filibeck:  ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ‘‘భారత్ సమ్మిట్’’ వివాదాలకు కేంద్రంగా మారింది. రాహుల్ గాంధీ హాజరైన ఈ సమావేశానికి పలువరు విదేశీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో ఇటలీ నాయకుడు గియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు భారత్‌తో రాజకీయంగా తీవ్ర వివాదానికి కారమయ్యాయి. భారత అంతర్గత రాజకీయ వివాదాల్లో తలదూర్చారని, విదేశీ నేత చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ నవ్వడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఫిలిబెక్ రాహుల్ గాంధీ నినాదమైన ‘‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’’ అనే నినాదాన్ని ప్రస్తావించారు.

ఫిలిబెక్‌పై ఫిలిప్పీన్స్ ఆంక్షలు:

అయితే, ఇటలీ నేత ఫిలిబెక్‌ను 2018లోనే ఫిలిప్పీన్స్ దేశం నుంచి బహిష్కరించింది. 2018 ఏప్రిల్‌లో ఓ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు గాయాకోమో ఫిలిబెక్ ఫిలిప్పీన్స్ వెళ్లారు. మక్టాన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన ‘‘చట్టవిరుద్ధ రాజకీయ కార్యకలాపాలకు’’ పాల్పడ్డారనే కారణంగా ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. అదే రోజు ఆయనను తిరిగి వెనక్కి పంపించారు. 2017 అక్టోబర్‌లో ఫిలిబెక్ అంతర్జాతీయ మానవ హక్కుల మిషన్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతెర్తే చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని విమర్శించారు. ఆ తర్వాతే ఇతడిని ఆ దేశం బ్లాక్ లిస్ట్ చేసింది. విదేశీ సందర్శకులు మరో దేశ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఫిలిప్పీన్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యను ఫిలిబిక్ కు చెందిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ ఖండించింది.

భారత్‌లో వీసా నిబంధనల ఉల్లంఘన..

ఫిలిబెక్ హైదరాబాద్ పర్యటించడం, భారత అంతర్గత రాజకీయాల్లో వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నేతలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనే అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఫిలిబెక్ ఈ-వీసా పోర్టల్ ద్వారా కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చాడు. ఆయన భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వీసా నిబంధనల్ని ఉల్లంఘించడమే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.