NTV Telugu Site icon

Isro spy case: “ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌”ని తప్పుడు కేసులో ఎందుకు ఇరికించారు.? కేరళ పోలీసులపై సీబీఐ సంచలన విషయాలు..

Isro Spy Case

Isro Spy Case

Isro spy case: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసులో సీబీఐ చివరి ఛార్జిషీట్‌ని దాఖలు చేసింది. జూన్ చివరి వారంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలను పేర్కొంది. 1994 ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ని కేరళ పోలీస్ తప్పుగా ఇరికించారని పేర్కొంది. మాల్దీవులకు చెందిన మహిళ పోలీస్ అధికారి చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతోనే, ఆమెను అక్రమంగా నిర్బంధించి, దానిని కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసును తీసుకువచ్చారని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.

గూఢచర్యం కేసులో నారాయణన్‌తో పాటు ఇద్దరు మాల్దీవుల మహిళలతో సహా మరో ఐదుగురిని ఇరికించారనే ఆరోపణలపై మాజీ పోలీసు అధికారులపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేంద్ర ఏజెన్సీ ఈ ఆరోపణ చేసింది. మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళ, అప్పటి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఎస్ విజయన్ ఆమె ప్రయాణ పత్రాలు, విమాన టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నాడని సీబీఐ పేర్కొంది. విజయన్ లైంగిక కోరికల్ని ఆమె తిరస్కరించడంతో దేశం విడిచివెళ్లకుండా ఈ పనిచేసినట్లు సీబీఐ పేర్కొంది. ఇస్రో శాస్త్రవేత్త డి శవికుమారన్‌తో రషీదా సంప్రదింపులు జరుతున్నాడని తెలుసుకున్న విజయన్, రషీదా మరియు ఆమె మాల్దీవుల స్నేహితురాలు ఫౌజియా హసన్‌పై నిఘా పెట్టినట్లు ఛార్జిషీట్ పేర్కొంది.

పోలీసులు మహిళ గురించి సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్బీఐ)కి సమాచారం అదించారని, అయితే విదేశీ పౌరులను పరిశీలించిన ఐబీ అధికారుల అనుమానాస్పదంగా ఏం కనుగొనలేకపోయారని సీబీఐ తెలిపింది. వీసా ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉన్నందుకు గానూ రషీదాను ఫారినర్స్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు సీబీఐ చెప్పింది. కస్టడీ గడవు ముగియనున్న సమయంలో విజయన్ సమర్పించిన తప్పుడు నివేదిక ఆధారంగా రషీదాతో పాటు ఫౌజియా హసన్‌ని గూఢచర్యం కేసు కింద ఇరికించి, సిట్ దర్యాప్తుకు అప్పగించారని తెలిపింది.

రషీదాను అక్రమంగా నిర్భందించిన విజయన్, గూఢచర్యం కేసులో ప్రాథమిక దశ నుంచి చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. ప్రాథమిక తప్పిదాలను కొనసాగించడానికి తప్పుడు నివేదిక ఆధారంగా ఈ తీవ్రమైన కేసు ప్రారంభమైందని, మాజీ డీజీపీలు ఆర్బీ శ్రీకుమార్, సీబీ మాథ్యూస్, ఎస్పీలు ఎస్ విజయన్, కేకే జాషువా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాష్‌ని ప్రాసిక్యూట్ చేయాలని సీబీఐ తన తుది నివేదికలో సిఫారసు చేసింది. అయితే, అప్పటి కేరళ పోలీస్, ఐబీ అధికారులతో సహా మిగిలిన 13 మంది నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేనందున విచారించాలని సీబీఐ సిఫారసు చేయలేదు.

అసలు కేసు ఏంటీ..?

పాకిస్తాన్‌కి ఇస్రో రాకెట్ ఇంజిన్‌కి చెందిన కీలక పత్రాలను సంపాదించినట్లు ఆరోపిస్తూ తిరువనంతపురంలో మాల్దీవులకు చెందిన రషీదాను కేరళ పోలీసులు అక్టోబర్ 1994లో రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి ఇస్రోలోని క్రయోజెనిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణన్‌తో పాటు అప్పటి స్పేస్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ డి శశికుమారన్ మరియు రషీదా మాల్దీవుల స్నేహితుడు ఫౌసియా హసన్‌ను అరెస్టు చేశారు.

అయితే, ఈ కేసులో నంబి నారాయణన్ తన ప్రమేయం లేదని చెప్పేందుకు 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేశారు. ఏప్రిల్ 15, 2021న, నారాయణన్‌కు సంబంధించిన 1994 గూఢచర్యం కేసులో తప్పుచేసిన పోలీసు అధికారుల పాత్రపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సీబీఐకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణలో ఈ కేసు మొత్తం అవాస్తమని తేలింది.

నారాయణన్‌కు అక్రమంగా జైలు శిక్ష విధించడం, దురుద్దేశపూర్వకంగా విచారించడం, అవమానాలు ఎదుర్కొన్నందుకు గానూనారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్‌ని ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్‌ అనుమానం వ్యక్తం చేశారు.