
దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలా లేదంటే ఆంక్షలను కఠినంగా అమలు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ సంపూర్ణ లాక్ డౌన్ విడిస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి? ఎలా వాటిని అధికమించాలి? లాక్ డౌన్ విధిస్తే ఎన్నిరోజులు లాక్ డౌన్ విధించాలి తదితర విషయాలపై ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు.