Site icon NTV Telugu

Haryana: నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు .. 2 వారాల తర్వాత పునరుద్ధరణ

Haryana

Haryana

Haryana: హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. 2 వారాల తర్వాత ఇక్కడ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరణ చేశారు. గత కొద్ది రోజులుగా నుహ్ జిల్లాలో మత హింసలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 31న రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జులై 31న మూసివేసిన విద్యా సంస్థలను కూడా గత వారమే తెరిచారు. హర్యానా రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు కూడా పూర్తిగా పునరుద్ధరించారు. విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో నిర్వహించిన మతపరమైన ఊరేగింపును మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలు హర్యానాలోని గురుగ్రామ్, పాల్వాల్, ఫరీదాబాద్ వంటి ఇతర జిల్లాలకు కూడా వ్యాపించాయి. తీవ్ర స్థాయిలో చెలరేగిన ఈ హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులు, ఒక మసీదు మతాధికారి సహా ఆరుగురు మరణించారు. అనేక వాహనాలు, దుకాణాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టారు.

Read also: Katrina Kaif Birthday Celebrations: బీచ్ ఒడ్డున కత్రీనా.. హొయలు పోతుందిలా

నుహ్‌లో జరిగిన మతపరమైన ఊరేగింపునకు గోసంరక్షకుడు మోను మనేసర్ హాజరవుతారనే పుకార్లు ఘర్షణలకు దారి తీశాయి. నుహ్ మతపరమైన ఊరేగింపుకు హాజరవుతున్నట్లు పేర్కొంటూ, పెద్ద సంఖ్యలో బయటకు రావాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చిన వీడియోను మానేసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘర్షణల్లో మనేసర్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మత పరమైన హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 390 మందికి పైగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి 100కి పైగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లు(ఎఫ్‌ఐఆర్‌) దాఖలు చేశారు. ఆదివారం పాల్వాల్‌లో ఒక హిందూ సంస్థ మహాపంచాయత్ నిర్వహించింది. అక్కడ సభ్యులు నుహ్ జిల్లాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని గోహత్య రహితంగా మార్చాలని 51 మందితో కూడిన కమిటీ సమావేశంలో తీర్మానించింది. అలాగే ఆగస్టు 28న నుహ్‌లో జలహిషేక్ యాత్రను మళ్లీ ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది.

Exit mobile version