InnoData Layoffs: టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు ఆగేలా లేవు. వరసగా జరుగుతున్న లేఆఫ్‌లతో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలతో పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే భయంలో బతుకుతున్నారు. ఇదిలా ఉంటే, ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ కోతల్ని ప్రకటించింది. భారత్‌లో దాదాపు 550 మంది ఉద్యోగులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన ఫిలప్పీన్స్ టీమ్‌లో కూడా లేఆఫ్స్ జరిగినట్లు సమాచారం.
లేఆఫ్ గురించి సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఓ ఇంజనీర్.. అక్టోబర్ 26, సోమవారం సాధారణ వర్కింగ్ డేగా ప్రారంభమైందని, అయితే కొద్దిసేపటికే పరిస్థితి మారిపోయిందని, కంపెనీ ట్యాప్‌టాప్‌ల నుంచి లాగ్అవుట్ కావడం, అధికారిక ఐడీలు డీయాక్టివేట్ కావడంతో ఉద్యోగం కోల్పోయిన వారిలో తాను కూడా ఉన్నట్లు గ్రహించానని చెప్పారు. ఉద్యోగుల కోతల గురించిన ఈమెయిల్స్ ఉద్యోగులకు చేరడం ప్రారంభమైందని వెల్లడించారు. కంపెనీ పంపించిన ఈమెయిల్లో.. ‘‘మీరు పనిచేస్తున్న బిజినెస్ అసైన్మెంట్లను తగ్గించిన నేపథ్యంలో ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మీ ఉద్యోగాన్ని 2026 అక్టోబర్ 26 నుంచి ముగించాలని కంపెనీ నిర్ణయించింది. ఇదే మీ చివరి పనిదినం’’ అని పేర్కొంది.
అమెరికాకు చెందిన ఇన్నోడేటా ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు అందించే సంస్ధ. దీని ప్రధాన కార్యాలయం న్యూజెన్సీలోని రిడ్జ్ఫీల్డ్లో ఉంది. 1998లో ప్రారంభమైన ఈ సంస్థ డేటా లేబెలింగ్, ఏఐ మోడళ్లకు శిక్షణ, భద్రతా పరీక్షల ద్వారా సాంకేతిక సంస్థలకు ఏఐ వ్యవస్థల అభివృద్ధిలో సహకరిస్తుంది.గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, సోనీ, హ్యూలెట్ ప్యాకర్డ్, స్నోఫ్లేక్, బోయింగ్, డెలాయిట్ వంటి సంస్థలు తమ కస్టమర్లుగా ఉన్నట్లు ఇన్నోడేటా వెబ్సైట్లో పేర్కొంది. 2025 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 10,107 మంది ఉద్యోగులు ఉన్నారు.

