LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం

  • LNG రైలుతో ఇంధన ఖర్చు తగ్గింపు
  • 444 కి.మీ. ప్రయాణించే సామర్థ్యం
Lng Dual Fuel Train

Lng Dual Fuel Train

India’s First LNG Train Launch Today: భారతీయ రైల్వేల్లో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే కీలక అడుగు పడనుంది. దేశంలో తొలిసారిగా LNG (లిక్విడ్ నేచురల్ గ్యాస్) ఆధారిత డ్యూయల్-ఫ్యూయల్ రైలును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. సబర్మతి రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా అమిత్ షా ప్రారంభించనున్నారు. దీనితో పాటు రైల్వే లోకో ఇంజిన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన WAG-12 మెయింటెనెన్స్ షెడ్‌ను కూడా ప్రారంభించనున్నారు.

ఒకే ఇంజిన్.. రెండు ఇంధనాలు

ఈ ప్రాజెక్టులో రైల్వే ఇంజిన్‌లో తొలిసారిగా LNG ఆధారిత డ్యూయల్-ఫ్యూయల్ వ్యవస్థను ఉపయోగించారు. ఈ సాంకేతికతతో ఒకే ఇంజిన్‌ను అవసరాన్ని బట్టి LNG, డీజిల్ రెండు ఇంధనాలతోనూ నడపవచ్చు. ప్రాజెక్టులో భాగంగా 1,400 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను (DPCs) LNG డ్యూయల్-ఫ్యూయల్ వ్యవస్థకు అనుగుణంగా మార్చారు. రైల్వే వివరాల ప్రకారం, ఈ రెండు DPCలపై ఇప్పటికే 2,000 కిలోమీటర్లకు పైగా ఫీల్డ్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ట్రయల్స్ సమయంలో సాంకేతికత పనితీరు, విశ్వసనీయత, రైలు నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించారు.

2,200 లీటర్ల LNG ట్యాంక్

డ్యూయల్-ఫ్యూయల్ ఇంజిన్‌లో 2,200 లీటర్ల సామర్థ్యం కలిగిన LNG ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 950 నుంచి 1,000 కిలోగ్రాముల వరకు ఉపయోగకరమైన LNG నిల్వ చేయవచ్చు. ట్యాంక్‌ను పూర్తిగా నింపినప్పుడు ఒక ఇంజిన్ సుమారు 444 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అంచనా.

ఇంధన ఖర్చు తగ్గించే అవకాశం

భారతీయ రైల్వేలు సంప్రదాయ డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు నిర్వహణ ఖర్చులు, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తున్నాయి. ట్రయల్స్‌లో లభించిన డేటా ఆధారంగా, ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి సుమారు రూ.23.9 లక్షల వరకు ఇంధన వ్యయం ఆదా కావచ్చని రైల్వే అంచనా వేసింది. అయితే వాస్తవ ఆదా LNG, డీజిల్ ధరలు, రైలు నిర్వహణ పరిస్థితులు, LNG వినియోగ నిష్పత్తి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కాలుష్య ఉద్గారాలు తగ్గే అవకాశం

రైల్వే ప్రకారం, LNG వినియోగంతో డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు CO₂, NOx, పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య ఉద్గారాలను కూడా తగ్గించే అవకాశం ఉంది. డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికతలో ప్రధాన ప్రయోజనం ఇంధన వినియోగంలో ఉన్న సౌలభ్యం. అవసరాన్ని బట్టి ఇంజిన్ LNG లేదా డీజిల్‌ను ఉపయోగించగలగడం వల్ల వివిధ ఆపరేటింగ్ పరిస్థితుల్లో రైల్వేకు మరింత సౌలభ్యం లభించనుంది. దేశంలో తొలి LNG డ్యూయల్-ఫ్యూయల్ రైలు ప్రారంభం భారతీయ రైల్వేలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేస్తున్న మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.