NTV Telugu Site icon

Aircraft Carrier Vikrant: భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ నేవీకి అప్పగింత

Ins Vikrant

Ins Vikrant

Aircraft Carrier Vikrant: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ నౌకాదళానికి అప్పగించబడింది. విస్తృతమైన వినియోగదారు అంగీకార ట్రయల్స్ తర్వాత కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) ‘విక్రాంత్’ను భారత నావికాదళానికి అప్పగించింది. స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’ను నిర్మించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఇవాళ భారత నౌకాదళానికి అప్పగించి చరిత్రను సృష్టించింది. ఇండియన్ నేవీ అంతర్గత డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్‌డీ) రూపొందించగా.. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ చేత నిర్మించబడింది, 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారతదేశపు మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వాహకనౌకకు ఐఎన్‌ఎస్ ‘విక్రాంత్’గా పేరు పెట్టారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో విక్రాంత్ పునర్జన్మ, సముద్ర భద్రతను పెంపొందించుకోవడం దేశ ఉత్సాహానికి నిజమైన నిదర్శనం” అని భారత నౌకాదళం పేర్కొంది.

యుద్ధనౌక అంటే యుద్ధానికి సంబంధించిన పనిలో ఉపయోగించే ఓడ అని సరళమైన భాషలో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అలాంటి నౌకలను ఒక దేశంలోని నౌకాదళం ఉపయోగిస్తుంది. విమాన వాహక నౌక కూడా ఒక రకమైన యుద్ధనౌక. ఒక విమాన వాహక నౌకను సముద్రంలో తేలుతున్న విమానాశ్రయంగా భావించవచ్చు. అంటే, విమాన వాహక నౌకలో విమానం టేకాఫ్ నుండి ల్యాండింగ్ వరకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. వీటి పని శత్రు దేశాల నావికాదళంతో వ్యవహరించడం నుండి వైమానిక దళానికి మద్దతు ఇవ్వడం వరకు ఉంటుంది. సముద్ర భద్రత విషయంలో యుద్ధనౌకల పాత్ర చాలా ముఖ్యమైనది.

విక్రాంత్ యుద్ధ నౌకను 23 వేల కోట్ల వ్యయంతో రూపొందించారు. ఈ విమాన వాహక నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. దీని గరిష్ట వేగం గంటకు 52 కిలోమీటర్లు. ఈ 14 అంతస్తుల క్యారియర్‌లో 2300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఓడలో ఒకేసారి 1700 మంది నావికులను నియమించవచ్చు. ఈ నౌకలో, మిగ్ -29 కె, కమోవ్ -31 హెలికాప్టర్‌లతో సహా 30 యుద్ధ విమానాలను కూడా ఏకకాలంలో మోహరించవచ్చు. అంతేకాకుండా స్వదేశీంగా తయారు చేయబడిన అధునాతన లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్), లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ( ఎల్‌సీఏ)లను కూడా నిర్వహించగలదు. ఇంతకు ముందు ఉన్న నౌక కన్నా చాలా పెద్దది, అధునాతనమైనది కూడా. మెషినరీ ఆపరేషన్, షిప్ నావిగేషన్, సర్వైబిలిటీ కోసం అధిక స్థాయి ఆటోమేషన్‌తో విక్రాంత్ నిర్మించబడింది. ఫిక్స్‌డ్-వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కలగలుపుకు అనుగుణంగా రూపొందించబడింది.

వాస్తవానికి, విక్రాంత్ అతి పెద్ద లక్షణం దాని స్వదేశీయత. విక్రాంత్ తయారీలో వాడిన మెటీరియల్స్, పరికరాలలో 76 శాతం భారతదేశంలో తయారు చేసినవే. దీని నిర్మాణం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీనితో, విమాన వాహక నౌకలను నిర్మించే సామర్ధ్యం కలిగిన ప్రపంచంలోని అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది. క్యారియర్‌ను డిజైన్ చేయడం నుండి సమీకరించడం వరకు, అన్ని పనులు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జరిగాయి. దీని పూర్తి బాధ్యత డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ (డీఎన్‌డీ) తీసుకుంది. నిర్మాణ సమయంలో దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభించింది.

OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

విక్రాంత్ నావికాదళంలో చేరితే భారతదేశానికి గొప్ప బలం అని అంటున్నారు. సుమారు 45 వేల టన్నుల బరువున్న ఈ ఓడలో ట్విన్ ప్రొపెల్లర్లు ఉన్నాయి. ఇవి సముద్రంలో ఈ భారీ ఓడను గంటకు 52 కిలోమీటర్ల వేగంతో నడిచేలా చేస్తాయి. సాధారణ పరిస్థితులలో, ఈ క్యారియర్ గంటకు 33 కిలోమీటర్ల వేగంతో నిరంతరం 13 వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. అలాగే, ఈ క్యారియర్ నుండి ఒకేసారి 30కి పైగా ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్‌లను ఆపరేట్ చేయవచ్చు. ఒకేసారి 2 వేలకు పైగా ప్రజలు ఇందులో నివసించవచ్చు. అంటే, ఈ విమాన వాహక నౌక ఒక చిన్న గ్రామం. ప్రారంభించిన తర్వాత, దీనిని ఐఎన్ఎస్ విక్రాంత్ అని పిలుస్తారు. ఈ విమాన వాహక నౌక పూర్తిగా నావికాదళంలో చేరడంతో హిందూ మహాసముద్రంలో భారతదేశ సరిహద్దు సామర్థ్యం పెరిగింది. అదేవిధంగా హిందూ మహాసముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న ప్రస్తుత పరిస్థితిలో.. విమాన వాహక నౌక సహాయంతో, చైనా, పాకిస్తాన్ రెండింటితోనూ భారత్ పోటీపడగలదు.

భారత నావికాదళం ఇది భారతదేశానికి ‘గర్వించదగిన, చారిత్రాత్మక దినం’ అని పేర్కొంది. భారతదేశం తన రెండవ స్వదేశీ విమాన వాహక నౌక విశాల్‌పై పనిచేస్తోంది. అయితే, దాని మొత్తం ప్రణాళిక ఇంకా ఆమోదించడం జరగలేదు. దీని ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ వాహక నౌకను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌తో సన్నద్ధం చేసే ప్రణాళికలో నేవీ పనిచేస్తోంది.

Show comments