NTV Telugu Site icon

Anji Khad bridge: ఇండియాలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన సిద్ధం.. ఎక్కడంటే..?

Anji Khad Bridge

Anji Khad Bridge

Anji Khad bridge: భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారితంగా నిర్మించిన రైలు వంతెన సిద్ధం అయింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంజి ఖాడ్ వంతెనగా పిలువబడే ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ బ్రిడ్జ్ వినియోగానికి సిద్ధం అయిందని, దీంట్లో మొత్తం 96 కేబుల్స్ ఉన్నాయని, కేబుల్స్ లో ఉండే మొత్తం వైర్ల పొడవు 653 కిలోమీటర్లు అని, 11 నెలల్లో ఈ వంతెనను నిర్మించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా (USBRL) రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ లోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కనెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. జమ్మూ నుంచి ఈ వంతెన దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంజి ఖాడ్ వంతెన జమ్మూ కాశ్మీర్లోని కట్రా, రియాసిలను కలుపుతుంది.

Read Also: Rekha Singh: భర్త పేరు నిలబెట్టింది.. ఆర్మీ ఆఫీసర్‌గా “గాల్వాన్ హీరో” భార్య..

హిమాలయాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో వంతెన నిర్మించాలంటే ఇంజనీరింగ్ అద్భుతమే అని చెప్పవచ్చు. రూర్కీ, ఢిల్లీ ఐఐటీల పరిశోధకలు వంతెన నిర్మించే స్థలం వద్ద పలు రకాల పరిశోధనలు చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం అయింది. మొత్తం వంతెన పొడవు 725.5 మీటర్లు. మొత్తం వంతెనను 4 భాగాలుగా విభజించారు. రియాసి వైపున 120 మీటర్లు పొడవు కలిగిన వయాడక్ట్, కట్రా చివరలో 38 మీటర్ల పొడవున్న వయాడక్ట్, ప్రధాన వంతెన 475.25 మీటర్ల కేబుల్ స్టెడ్, దీనికి అప్రోచ్ గా 94.5 మీటర్ల వయాడక్ట్ ఏర్పాటు చేసి వంతెనను నిర్మించారు. ఇందులో ప్రధాన వంతెన మొత్తం పొడవు 475.25 మీటర్లు. అంజి ఖాడ్ వంతెన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ యొక్క కత్రా-బనిహాల్ సెక్షన్‌లో T2 మరియు T3 సొరంగాలను కలుపుతుంది.

ఈ వంతెన పునాది పైభాగం నుండి 193 మీటర్ల ఎత్తులో ఒకే ప్రధాన పైలాన్‌ను కలిగి ఉంది, ఇది నదీ గర్భం నుండి 331 మీటర్ల ఎత్తులో ఉంది. గంటకు 213 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకుని ఉండేలా ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం 40 టన్నులను ఎత్తగలిగే శక్తివంతమైన క్రేన్ ను స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వంతెన పూర్తిగా సెన్సార్స్ అమర్చారు.