Site icon NTV Telugu

Pahalgam Terror Attack: అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్న భారత్.. విదేశీ దౌత్యవేత్తలకు వివరాలు..

J And K

J And K

Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తన చర్యల్ని వేగవంతం చేసింది. పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి, టెర్రరిస్టుల దాడి గురించి వివరించడానికి ప్రపంచ దౌత్యవేత్తలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే, భారత్ ఉగ్రదాడి గురించి అమెరికా, యూరోపియన్ దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సమావేశానికి జపాన్, ఖతార్, చైనా, కెనడా మరియు రష్యా నుండి దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు.

Read Also: Pak Link: పహల్గాం ఎటాక్.. పాకిస్తాన్ హస్తం..!!

సాధారణ పౌరులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడుల గురించి, పాకిస్తాన్ ప్రమేయం గురించి 30 నిమిషాల పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ మిస్రీ అంతర్జాతీయ దౌత్యవేత్తలకు వివరించారు. బీహార్ మధుబనిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్రమోడీ టెర్రరిస్టులకు, వారికి మద్దతు ఇచ్చేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ భారతదేశం ప్రతీ ఉగ్రవాదిని, వారి వెనక ఉన్న వారిని శిక్షిస్తుందని ప్రపంచాన్ని చెబుతున్నాను. వారు ఊహించలేని విధంగా ప్రతీకారం ఉంటుంది’’ అని చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే, ప్రపంచ దేశాల దౌత్యవేత్తలకు భారత్ సంఘటనను వివరించింది.

పహల్గామ్ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై ప్రపంచదేశాలు భారత్‌కి సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ దాడికి పాల్పడింది మేమే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, బ్రెజిల్, ఇజ్రాయిల్, చైనా, శ్రీలంక, నేపాల్ సహా అన్ని ప్రపంచదేశాలు ఈ దాడిని ఖండించాయి.

Exit mobile version