Site icon NTV Telugu

Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్ అరెస్ట్.. కారణం ఏంటంటే..

Indian Youtuber Arrest

Indian Youtuber Arrest

Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టర్కిష్ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత, అసభ్యకరమై వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ‘‘మాలిక్ స్వాష్‌బక్లర్’’ అని పిలువబడే మాలిక్ ఎస్‌డీ ఖాన్, తన ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై విమర్శలకు గురయ్యాడు. టర్కిష్ మహిళపై లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వివాదం నేపథ్యంలో మాలిక్ తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి ఈ వీడియోలను తొలగించినప్పటికీ, కొన్ని వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టర్కీలోని స్థానికులు హిందీని అర్థం చేసుకోలేరని, అతను అసభ్యకరమైన భాషను ఉపయోగించినట్లు వీడియోలో చూడవచ్చు. అతను మహిళపై అత్యాచార బెదిరింపులు, లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.

Read Also: US-India Trade Deal: భారతదేశంతో త్వరలో వాణిజ్య ఒప్పందం: యూఎస్ వాణిజ్య కార్యదర్శి..

ఒక క్లిప్‌లో టర్కిష్ మహిళను ఉద్దేశిస్తూ ‘‘మాల్’’ అని పేర్కొన్నాడు. మరొకదానిలో టర్కిష్ గైడ్‌ని రాత్రిపూట లైంగికంగా వేధించాలా..? అని తన ఆడియన్స్‌ని అడిగాడు. మరొక వీడియోలో ఒక టర్కిష్ దుకాణదారుడితో అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. భారతీయ జెండాను ఎందుకు ప్రదర్శించలేదో చెప్పమని అతడిని డిమాండ్ చేశాడు. వీడియోలో ఏం అంటున్నాడో అర్థం చేసుకున్న కొంతమంది టర్కిష్ సోషల్ మీడియా యూజర్లు వీటిని షేర్ చేశారు. దీంతో మాలిక్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో టర్కీ పోలీసులు మాలిక్ స్వాష్‌బక్లర్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అయితే, యూట్యూబర్ అరెస్ట్‌పై టర్కీ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ టర్కీ డ్రోన్లు ఉపయోగించి భారత్‌పై దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనే భారతీయ యూట్యూబర్ అరెస్ట్ కేసు వచ్చింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో చాలా మంది భారతీయ పర్యాటకులు టర్కీని బాయ్‌కాట్ చేశారు.

Exit mobile version