Indian Talent: పిల్లలు అదే పనిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తూ ఉంటే చదువును అశ్రద్ధ చేస్తారేమోనని తల్లిదండ్రులు భయపడటం సహజం. కానీ ఆ పిల్లల్లో పుట్టుకతో వచ్చిన తెలివితేటలు ఉంటే వాళ్లు ఎప్పుడైనా అద్భుతాలను సృష్టిస్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన వేదాంత్ దీనికి తాజా ఉదాహరణ. అతని తల్లిదండ్రులు ప్రొఫెసర్లు. కాబట్టి వాళ్ల స్థాయికి తగ్గట్లే బాగా చదువుతున్నాడు. స్కూల్లో ఓసారి సైన్స్ ఎగ్జిబిషన్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అదీ.. వేదాంత్ ట్యాలెంట్. అయితే అతనికి పేరెంట్స్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఎక్కువగా ఇచ్చేవాళ్లు కాదు.
సెల్‌ఫోన్లకి లాక్ పెట్టేవాళ్లు. ల్యాప్‌టాప్‌లను అతని చేతికి చిక్కకుండా కారులో ఉంచేవాళ్లు. కానీ ఇవేవీ వేదాంత్ ఆసక్తిని ఆపలేకపోయాయి. ఓసారి తల్లి తన ల్యాప్‌టాప్‌ని కారులో పెట్టకుండా ఇంట్లోకి తీసుకొచ్చింది. పాస్‌వర్డ్ పెట్టడం మర్చిపోయి ఊరికి వెళ్లింది. దీంతో ఆ లాప్‌టాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా ఒక లింక్ వచ్చింది. అది ఓ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ కాంపిటీషన్‌కి సంబంధించింది. వేదాంత్ ఆ లింక్ ఓపెన్ చేసి పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లోనే 2066 లైన్ల కోడ్ రాశాడు. దీంతో ఓ అమెరికా కంపెనీలో ఉద్యోగం పొందాడు. వార్షిక ప్యాకేజ్ రూ.33 లక్షలు. అంటే నెలకి దాదాపు రూ.3 లక్షలు.
read also: KTR: ‘బీఎస్ కుమార్’.. భలే సెటైర్. ఆకట్టుకున్న కేటీఆర్ కౌంటర్.
వేదాంత్‌కి జాబ్ ఆఫర్ చేసిన సంస్థ న్యూజెర్సీకి చెందిన ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. వాళ్లు వేదాంత్‌ని తమ హెచ్‌ఆర్ విభాగంలో జాయిన్ కావాలంటూ ఆహ్వానించారు. ఇతరులకు వర్క్ అసైన్ చేస్తూ కోడ్‌లను మేనేజ్ చేస్తే చాలు అని డ్యూటీ కూడా ఇచ్చారు. ఈ జాబ్ కోసం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది పోటీపడగా అందులో వేదాంత్ సెలెక్ట్ కావటం విశేషం. అయితే.. అతని వయసు 15 సంవత్సరాలు మాత్రమే అని తెలిసి అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసింది. కానీ.. నిరుత్సాహపడొద్దని, చదువు పూర్తికాగానే తమను సంప్రదిస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.
బహుశా ఆ కంపెనీవాళ్లు ఆ కోడ్‌ను వేదాంత్ తల్లి రూపొందించినట్లు భావించి ఉంటారు. ఎందుకంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ ఆమె పేరు మీదే క్రియేట్ అయుంటుంది. వేదాంత్ డెవలప్ చేసిన వెబ్‌సైట్ పేరు అనిమీడిటర్.కామ్(animeeditor.com). ఈ వెబ్‌సైట్‌లోకి యూట్యూబ్ మాదిరిగా వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు. యూట్యూబ్‌తో పోల్చితే దీనికి పలు అదనపు ఫీచర్లు ఉన్నాయి. బ్లాగ్స్, విలాగ్స్, చాట్‌బాట్, వీడియో వాచింగ్ ప్లాట్‌ఫాం, ప్రొఫైల్ ఎడిట్, లైవ్ ఫాలోవర్స్, లైక్స్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్, వర్చువల్ స్టూడియో కోడ్(2022) సాయంతో వేదాంత్ ఈ వెబ్‌సైట్‌ని రూపొందించాడు.
ఇంటర్నెట్‌లో ఆసక్తిగా సెర్చ్ చేసి కనుక్కొని మరీ ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అవటం ద్వారా ఈ స్కిల్స్ నేర్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై సుమారు 24 ట్యుటోరియల్ సెషన్స్‌కి హాజరై మెలకువలన్నీ ఒంటబట్టించుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో పైథాన్, కోడింగ్ వంటి టెక్నిక్స్‌పై గ్రిప్ సాధించాడు. ఇవన్నీ తల్లి వాడే పాత ల్యాప్‌టాప్‌లోనే ఆమె తెలియకుండానే నేర్చేసుకున్నాడు. స్లోగా పనిచేసే ఆ ఔట్‌డేటెడ్ ల్యాప్‌టాప్‌తోనే అమెరికా కంపెనీని సైతం మెప్పించేలా వెబ్‌సైట్‌ని డిజైన్ చేయటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. తనకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని వేదాంత్ డైరెక్ట్‌గా తన పేరెంట్స్‌కి చెప్పలేదు. స్కూల్‌వాళ్లు ఫోన్ చేసి చెబితేగానీ తల్లిదండ్రులకు తెలియలేదు. దీన్నిబట్టి వేదాంత్‌తో అతని పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లో అర్థంచేసుకోవచ్చు. ఈ జాబ్ ఆఫర్‌కి సంబంధించి అమెరికా సంస్థ వేదాంత్‌కి ఇ-మెయిల్ పెట్టింది. కానీ అది అతనికి అర్థంకాలేదు. నాకేంటి? అమెరికాలో ఉద్యోగం రావటం ఏంటి? అని అనుకున్నాడు. టీచర్స్‌తో చెబితే వాళ్లు ఆ సంస్థను కాంటాక్ట్ అయి, కన్ఫాం చేసుకొని, చివరికి జరిగిందంతా తెలుసుకొని స్టన్ అయ్యారు.
వేదాంత్ వయసు 15 ఏళ్లు మాత్రమేనని, అతను తమ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడని వాళ్లు చెబితేనే ఆ కంపెనీవాళ్లకు కూడా తెలిసింది. వేదాంత్‌లో ఇంత ట్యాలెంట్ ఉందా అని అతని తల్లిదండ్రులే ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. ల్యాప్‌టాప్ వాడుతుంటే ఏదో టైంపాస్ చేస్తున్నాడులే అనుకున్నారు. ఇంత తెలివిగల కొడుకు పుట్టడం నిజంగా ఆ పేరెంట్స్ అదృష్టమని, అతను తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని వేదాంత్ స్కూల్ ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు.