NTV Telugu Site icon

Indian railway: ముందస్తు రైల్వే రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం.. కొత్త రూల్ ఇదే!

Indianrailway

Indianrailway

దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా ముఖ్యమైన పండుగలు వచ్చినప్పుడు ముందుగానే ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకుంటారు. లేదంటే ట్రైన్ ఎక్కడానికి కూడా చోటుండదు. ఫెస్టివల్స్ సమయాల్లో రిజర్వేషన్ బోగీలు కూడా కిక్కిరిసిపోతుంటాయి. అందుకోసమే నాలుగు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని రిలాక్స్ అవుతుంటారు. దీనిని బట్టి రైల్వేలో రిజర్వేషన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.

అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 120 రోజులు ముందే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ కాలాన్ని తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ తెలిపింది. అయితే గతంలోనే 120 రోజులకు ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్న వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. నవంబర్ 1 నుంచి కొత్తగా రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రం కొత్త ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. అంటే అక్టోబర్ 31 వరకు అడ్వాన్స్ బుకింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది