Indian Railways cancelled grants to senior citizens: రైల్వే శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకు ఇచ్చే రాయితీని తొలగించింది. కోవిడ్ సమయంలో ఇండియన్ రైల్వే అన్ని రాయితీలు నిలిపివేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని ఇటీవల రైల్వేశాఖకు అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు స్పందించిన రైల్వే శాఖ వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. టిక్కెట్ రాయితీల గురించి పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాయితీల వల్ల రైల్వేశాఖపై పెనుభారం పడుతోందని ఆయన వివరించారు.
Read Also: మన దేశంలోని పలు రాష్ట్రాలకు నిక్ నేమ్స్
రాయితీ వల్ల 2017-20 మధ్య రూ.4,794 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు కోల్పోయినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సంస్థపై భారం పడుతుందనే రాయితీలను రద్దు చేశామని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రయాణికుల వల్ల ఇప్పటికే సగటున 50 శాతం ఖర్చును రైల్వే శాఖ భరిస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటం కూడా రైల్వేల నష్టానికి కారణమన్నారు. కరోనా కారణంగా 2019-20తో పోలిస్తే ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. దీంతో దీర్ఘకాలంలో రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల సీనియర్ సిటిజన్లు సహా అన్ని కేటగిరీల వారికీ రాయితీ పునరుద్ధరణ అనేది ఆశించడం సరికాదన్నారు. కాగా గతంలో 50 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు రైల్వేశాఖ 50శాతం రాయితీ కల్పించేది. అటు 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు 40 శాతం రాయితీని అందించేది.
