NTV Telugu Site icon

UK: లండన్‌లో ఇండియన్స్ VS ఖలిస్తానీలు.. రాయబార కార్యాలయం ముందు ఉద్రిక్తత..

Uk

Uk

UK: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖలిస్తానీ మూకలు రెచ్చిపోయాయి. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడిన కొంత మంది ఖలిస్తానీ మద్దతుదారులు భారత దేశం, భారత సమగ్రతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అదే సమయంలో రిపబ్లిక్ డే వేడులకు చూసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులు, ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రతిగా నినాదాలు చేశారు. భారతదేశాన్ని కీర్తిస్తూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ఖలిస్తానీలు భారత జెండాను అవమానించినట్లు భారతీయులు ఆరోపించారు.

Read Also: Minister Savita: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక

దీనికి ముందు కంగనా రనౌత్ నటించిన ఎమర్జె్న్సీ సినిమా ప్రదర్శిస్తున్న యూకేలోని సినిమా థియేటర్లలో కొంతమంది ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. భారత వ్యతిరేక, హింసాత్మక శక్తుల నిరసనలు, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని కోరింది. ఈ శక్తులపై చర్యలు తీసుకోవాలని, భారత్ యూకే ముందు తన ఆందోళనను నిరంతరం తెలియజేస్తోందని, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేక చర్యలకు పాల్పడటాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.

ముఖ్యంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ, అతడి సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) యూకేలో ‘‘కిల్ మోడీ పాలిటిక్స్’’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. వెస్ట్ బ్రోమ్విచ్‌లోని గురుద్వారాలో ప్రధాని మోడీ, ఫారిన్ మినిస్టర్ జైశంకర్ ‘‘కిల్ మోడీ పాలిటిక్స్’’, వాంటెడ్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు లండన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. పలు సందర్భాల్లో యూకేకి భారత్ నిరసన తెలిపినప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదు.