Bharat Mobility Global Expo 2024: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024ని సందర్శించి, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధాని అభినందించారు. ఎక్స్‌పోని పలు స్టాల్స్ తనని ఆకట్టుకున్నాయని, అయితే తాను పూర్తిగా అన్ని స్టాల్స్‌ని చూడలేకపోయానని అన్నారు. తాను ఎప్పుడూ కార్ కొనలేదని, చివరకు సైకిల్ కూడా కొనలేదని ప్రధాని అన్నారు.
భారత్ 2047లో ‘విక్షిత్ భారత్’ కావడానికి ముందుకెళ్తోందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోందని, మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని వెల్లడించారు. భారతదేశంలో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న నియో మిడిల్ క్లాస్ ఏర్పడిందని చెప్పారు. భారతదేశంలో మధ్యతరగతి పరిధి కూడా పెరిగిందని, వారి ఆదాయం వేగంగా పెరుగుతోందని ప్రధాని వెల్లడించారు.
Read Also: Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అందుకు అడ్డు వస్తున్నాడని..!
2014కి 10 ఏళ్ల ముందు దేశంలో సుమారు 12 కోట్ల వాహనాలు విక్రయించబడితే.. 2014 నుంచి 21 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయని, 10 ఏళ్ల క్రితం దేశంలో 2000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే, ప్రస్తుతం 12 లక్షల ఎలక్ట్రిక్ వాహానాలు అమ్ముడయ్యాయని, గత 10 ఏళ్లలో పాసింజర్ వాహనాల్లో 60 శాతం వృద్ధి నమోదైందని ప్రధాని అన్నారు.
2014లో, భారతదేశ మూలధన వ్యయం రూ. 2 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది. నేడు 11 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. అటల్ టన్నెల్ నుంచి అటల్ సేతు వరకు అనేక ఇంజనీరింగ్ అద్భుతాలను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, సముద్రాలు, పర్వతాలను సవాల్ చేస్తున్నామని ప్రధాని అన్నారు. గత 10 ఏళ్లలో 75 కోట్ల విమానాశ్రయాలు నిర్మించబడ్డాయని, దాదాపుగా 4 లక్షల గ్రామీణ రోడ్లను నిర్మించామని వెల్లడించారు.
ట్రక్కులు మరియు టాక్సీలు నడిపే డ్రైవర్లు మన సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. తరచుగా ఈ డ్రైవర్లు గంటలు కొద్దీ నిరంతరంగా ట్రక్కులను నడుపుతారు, వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోందని, ఈ పథకం కింద అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్ల కోసం కొత్త సౌకర్యాలతో, ఆధునిక భవనాలను నిర్మిస్తామని ప్రధాని చెప్పారు.