Site icon NTV Telugu

ఇతర దేశాలకు మరోసారి భారత్‌ వ్యాక్సిన్‌..!

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారు చేసిన భారత్‌.. అగ్రదేశాలు ఎవరూ చేయని విధంగా.. ఉదారంగా ఇతర దేశాలకు సాయం చేసింది. కోట్లాది డోసులు ఉచితంగా చిన్న దేశాలకు పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది. అయితే, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ ఎఫెక్ట్‌, టీకా కొరత, విపక్షాల విమర్శలతో గత కొన్ని నెలలుగా విదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా నిలిపి వేసిన ఇండియా… మరోసారి కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.

కొవిడ్ వ్యాక్సిన్లను అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు, వ్యాక్సిన్ల విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. భారతీయులకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన డోసులను వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమం, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 100 దేశాలకు 6.6కోట్ల డోసులను విదేశాలకు సరఫరా చేసిన కేంద్రానికి.. వచ్చే మూడు నెలల్లో మొత్తం 100 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులు అందనున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version