LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..

  • స్వదేశీ LRLACM క్రూయిజ్ మిసైల్‌ పరీక్ష విజయవంతం.
  • 1,000-1,500 కి.మీ వరకు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం.
  • భూమి, యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ఛాన్స్.
  • రాడార్‌లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే ప్రత్యేకత.
  • పాకిస్థాన్, చైనాలోని కీలక వ్యూహాత్మక ప్రాంతాలు పరిధిలోకి వచ్చే అవకాశం.
Lrlacm

Lrlacm

LRLACM: భారత రక్షణ రంగం మరింత బలపడింది. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘‘లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్(LRLACM)ను ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణి ప్రపంచంలోనే శక్తివంతమైన అమెరికా ‘‘తోమహాక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ఏ మాత్రం తక్కువ కాదని తెలుస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్షిపణి పరీ సమయంలో అన్ని సాంకేతిక పరీక్షల్ని క్షిపణి చేరుకున్నట్లుగా, లక్ష్యాలను చేధించినట్లుగా తెలిపింది. ఈ క్షిపణి పూర్తిస్థాయిలో సైన్యం చేతికి రావాలంటే మరికొన్ని పరీక్షలు జరపాల్సి ఉంది. మరో రెండేళ్ల తర్వాత సైన్యంలో చేరే అవకాశం ఉంది.

స్వదేశీ తోమహాక్ పరిధిలో చైనా, పాక్..

ఈ క్షిపణికి సంబంధించిన లక్షణాలు, పరిధి గురించి అధికారికంగా వెల్లడించకపోయినా, దీని పరిధి 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ క్షిపణి పరిధిలోకి చైనా, పాకిస్తాన్ వస్తాయి. సరిహద్దుల్లో దీనిని మోహరిస్తే రెండు దేశాల్లోని వ్యూహాత్మక కేంద్రాలు భారత్ పరిధిలోకి వస్తాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ వంటి కీలక నగరాలు భారత్ పరిధిలో ఉంటాయి. చైనాలోని లాసా, చెంగ్డు, ఉరుంకీ, కన్మింగ్ వంటి వ్యూహాత్మ క ప్రాంతాలు క్షిపణి పరిధిలోకి వస్తాయి.

×
×
Ad

ఎందుకింత ప్రత్యేకం.?

LRLACM పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించింది. గతంలో డెవలప్ చేసిన నిర్భయ్ క్షిపణికి ఇది అధునాతన రూపంగా భావిస్తున్నారు. ఈ క్షిపణిని భూమిపై నుంచి లాంచర్ల ద్వారా, యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. సంప్రదాయ లేదా అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.

ఇది బాలిస్టిక్ మిస్సైళ్ల ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ, భూ వాతావరణంలోకి వేగంగా రీ ఎంట్రీ ఇచ్చి లక్ష్యాలను ఢీకొట్టదు. భూమికి తక్కువ ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మోస్ లాగే ప్రయాణిస్తుంది. కానీ బ్రహ్మోస్‌తో పోలిస్తే దీని పరిధి ఎక్కువగా ఉంటుంది. భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా దాడులు చేసే సామర్థ్యం ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తే, LRLACM సబ్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.

అమెరికా వద్ద ఉన్న తోమహాక్ పరిధి 1250 కి.మీ నుంచి 2500 కి.మీ మధ్య ఉంటుంది. బ్లాక్ -4 తోమహాక్ వెర్షన్ గాలిలో ఉండగానే తన లక్ష్యాలను మార్చుకోగలదు. అమెరికా 1983లో యూఎస్ నేవీలోకి వీటిని తీసుకుంది. 1991 సద్దాం హుస్సేన్ నేతృత్వంలో ఇరాక్ దళాలు కువైట్‌పై దాడి చేసిన సమయంలో అమెరికా ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్‌లో దీనిని ఉపయోగించింది. తాజాగా ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా వీటిని వాడింది.