NTV Telugu Site icon

Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘‘లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్’’ సక్సెస్..

Cruise Missile

Cruise Missile

Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షని విజయవంతంగా నిర్వహించారు. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిస్సైల్ వే పాయింట్ నావిగేషన్‌ని ఉపయోగించి కావాల్సిన మార్గాన్ని అనుసరించినట్లు తెలిపారు. వివిధ ఎత్తుల్లో, వేగంగా ఎగురుతున్న సమయంలో వివిధ రకాల విన్యాసాలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెప్పారు. మెరుగైన, మరింత విశ్వసనీయమైన పనితీరును నిర్ధారించడానికి మిస్సైల్‌లో అధునాతన ఏవియానిక్స్, సాఫ్ట్‌వేర్ ఉన్నాయి.

Read Also: Starlink: భారత్‌లో త్వరలో స్టార్‌లింక్..? జియో, ఎయిర్‌టెల్‌పై ఎఫెక్ట్..

“డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుండి ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) యొక్క తొలి విమాన పరీక్షను నిర్వహించింది” అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్లు క్షిపణి పనితీరును పర్యవేక్షించాయి. క్షిపణి మార్గాన్ని కవర్ చేయడానికి వివిధ ప్రదేశాల్లో వీటిని మోహరించారు.

డీఆర్‌డీవో పాటు బెంగళూర్‌లోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ద్వారా LRLACM అభివృద్ధి చేయబడింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్- హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- బెంగళూరు LRLACM కోసం రెండు డెవలప్‌మెంట్-కమ్-ప్రొడక్షన్-పార్టనర్‌లుగా ఉన్నాయి. మిస్సైల్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్‌లో నిమగ్నమయ్యాయి. LRLACM అనేది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్-ఆమోదించిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్. ఇది మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్‌ను ఉపయోగించి భూమి నుండి, యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ సిస్టమ్‌ను ఉపయోగించి ఫ్రంట్‌లైన్ షిప్‌ల నుండి ప్రయోగించేలా కాన్ఫిగర్ చేయబడిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. డీఆర్డీవో, సాయుధ దళాలను, క్షిపణి తయారీ పరిశ్రమను ప్రశంసించారు.

Show comments