NTV Telugu Site icon

India seizes Pak consignment: చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్‌ని సీజ్ చేసిన భారత్..

India Seizes Pak Consignment

India Seizes Pak Consignment

India seizes Pak consignment: చైనా నుంచి దాని మిత్రదేశం పాకిస్తాన్ వెళ్తున్న ప్రమాదకరమైన, నిషేధిత జాబితాలో ఉన్న రసాయన పదార్థాలు కలిగిన షిప్‌మెంట్‌ని భారత్ సీజ్ చేసింది. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని కట్టుపల్లి ఓడరేవు వద్ద చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న నౌకను అధికారులు తనిఖీ చేశారు. చైనసీ సంస్థ చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ నుంచి పాకిస్తాన్ రావల్పిండిలోని డిఫెన్స్ సప్లయర్ అయిన రోహైల్ ఎంటర్‌ప్రైజెస్‌కి ‘‘ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్’’ సరుకు రవాణా అవుతోందని అధికారులు వెల్లడించారు.

దాదాపుగా 2560 కిలోల బరువున్న ఈ సరుకు ఒక్కొక్కటి 25 కిలోలు కలిగిన 103 డమ్ముల్లో భద్రపరిచారు. 2024 ఏప్రిల్ 18న చైనాలోని షాంఘై పోర్టులోని హ్యుందాయ్ షాంఘై పేరు కలిగిన నౌకలో లోడ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరాచీకి వెళ్లే ఈ ఓడ మే 08, 2024లో కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. భారత ఎగుమతి నియంత్రణ జాబితా ‘SCOMET’లో ఈ కెమికల్ పేరు కూడా ఉంది. దీనిని నియంత్రిత పదార్థంగా గుర్తించి, కస్టమ్స్ అధికారులు దీనిని సీజ్ చేశారు.

Read Also: Tata Consultancy Services: టీసీఎస్ తొలి త్రైమాసిక ఆదాయం విడుదల..3నెలల్లో రూ.12000కోట్లు లాభం..

ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ (CS) పాకిస్తాన్ వెళ్తుందని అధికారులు గుర్తించారు. వాసెనార్ ఒప్పందంలో భాగంగా ఇది నిషేధిత జాబితాలో ఉంది. అయితే, వాసెనార్ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, చైనా-పాకిస్తాన్ సంతకం చేయలేదు. కస్టమ్స్ చట్టం, 1962 మరియు ఆయుధాల మాస్ డిస్ట్రక్షన్ మరియు డెలివరీ సిస్టమ్స్ (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) చట్టం, 2005 కింద ఈ రసాయన సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యంగా టియర్ గ్యాస్, అల్లర్లను నియంత్రించే ఏజెంట్లలో ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. దీనిని అంతర్జాతీయంగా నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని జీవ యుద్ధ కార్యక్రమంలో పాకిస్తాన్ ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. మార్చిలో ముంబైలోని నవాషెవా పోర్టులో కూడా పాకిస్తాన్‌కి వెళ్తున్న అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సరుకును భారత్ అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ సరుకు కూడా చైనా నుంచి కరాచీకి వెళ్తున్నట్లు తేలింది.