Site icon NTV Telugu

India-Canada: కెనడాకు వీసా ప్రక్రియను ప్రారంభించిన భారత్.. కొన్నింటికి మాత్రమే అనుమతి..

India Vs Canada

India Vs Canada

India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం ఏర్పడింది. ఈ పరిణామాల తర్వాత భారత్, కెనడా వీసాల ప్రక్రియను రద్దు చేసింది. తాజాగా కెనడా వీసా సేవలను అక్టోబర్ 26 నుంచి పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఒట్టవాలోని భారత హైకమిషన్ బుధవారం తెలిపింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలు మాత్రమే పున:ప్రారంభమవుతాయని హైకమిషన్ తెలిపింది. పరిస్థితులను బట్టీ తగిన విధంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని హైకమిషన్ మీడియా ప్రకటనలో పేర్కొంది.

Read Also: Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఆశీర్వాదంగా భావిస్తున్నానన్న ప్రధాని మోడీ..

ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హతమర్చారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. అంతే కాకుండా కెనడాలోని సీనియర్ భారత్ దౌత్యవేత్తను బహిష్కరించారు. అయితే దీనికి ప్రతిగా భారత్ కూడా అంతే సీరియస్ గా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా చేస్తున్న ఆరోపణలను అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని భారత విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది.

ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. అంతకుముందు ఆదివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రతలో పురోగతి ఉంటే కెనడాకు వీసా సేవల్ని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు.

Exit mobile version