Site icon NTV Telugu

Indo-Pak: పాకిస్థాన్‌కు మళ్లీ భారత్ హెచ్చరికలు.. తావి నదిలో భారీగా వరదల ఉంటాయని వార్నింగ్

Indopak

Indopak

తావి నదిలో భారీగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని ఇటీవల పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. తాజాగా మరోసారి ఇస్లామాబాద్‌కు వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మానవతా దృక్పథంతో ఇస్లామాబాద్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో

మంగళవారం జమ్మూలో కురిసిన భారీ వర్షాల కారణంగా తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాలయాల్లో ఉద్భవించిన ఈ నది జమ్మూ గుండా ప్రవహిస్తుంది. పాకిస్థాన్‌లోని చీనాబ్ నదిలో ఇది కలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన ఆనకట్టల నుంచి అదనపు నీటిని విడుదల చేయాల్సి రావడంతో తావి నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని బుధవారం మరోసారి పాకిస్థాన్‌కు భారతదేశం హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే సరిహద్దు వెంబడి ఆస్తి, ప్రాణనష్టం జరగకూడదన్న కారణంతో వరద హెచ్చరికలు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

పంజాబ్‌లో సట్లెజ్, బియాస్, రావి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. జమ్మూలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కీలక జలాశయాల గేట్లను తెరవాల్సి వచ్చింది. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటి వరకు 32 మంది చనిపోగా.. 20 మంది గాయపడ్డారు.

ఇక రావి నదిలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను ముంచెత్తింది. వారసత్వ ప్రదేశాలు రెండింటికీ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version