Site icon NTV Telugu

Illegal Nuclear Test: పాకిస్తాన్ కూడా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుంది..

Jaisawal

Jaisawal

Illegal Nuclear Test: పాకిస్తాన్‌ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు అని ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ ద్వారా అణు విస్తరణ లాంటి చర్యల్లో పాలుపంచుకుంటూనే ఉందని ఆరోపించారు. ఈ విషయాలపై భారత్‌ అంతర్జాతీయ సమాజ దృష్టికి తీసుకెళ్తుందన్నారు.

Read Also: Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!

కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. రష్యా, చైనా, పాకిస్తాన్‌, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాత సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ కొనసాగుతుంది.. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నుంచి మే 12 మధ్య ఆఫ్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌ ప్రాంతాల్లో సంభవించిన 4.0 నుంచి 4.7 తీవ్రత గల భూకంపాల నేపథ్యంలో పాకిస్తాన్‌ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్‌ చివరిసారిగా 1998లో చాగై-I, చాగై-II అణు పరీక్షలు నిర్వహించింది. కాగా, భారతదేశం అదే సంవత్సరం రాజస్థాన్‌లోని పోఖ్రన్‌లో చేసిన అణు పరీక్షలకు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్ అణు పరీక్షలు చేపట్టింది. అప్పటి నుంచి ఆ దాయాది దేశం ఎలాంటి అణు పరీక్షలు అధికారికంగా జరిపినట్లు రికార్డుల్లో ఎక్కడ లేవు.

Exit mobile version