Emergency Alert: మీ మొబైల్స్‌ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!

  • మీ మొబైల్స్‌ పెద్ద శబ్దంతో మోగాయా?
  • కంగారు పడకండి
  • సందేశం ఉద్దేశం ఇదే
Emergencyalert2

Emergencyalert2

దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం 11:41 గంటలకు అన్ని మొబైల్స్ పెద్ద శబ్దంతో మార్మోగాయి. అన్ని ఫోన్లు ఒకేసారి సౌండ్ చేయడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. కొందరికి అసలు విషయం తెలియక భయాందోళన చెందారు. విద్యావంతులకు అసలు విషయం తెలియడంతో లైట్ తీసుకున్నారు కానీ.. సామాన్య ప్రజలు మాత్రం ఝలక్‌కు గురయ్యారు.

అయితే అసలు విషయాన్ని కొస్తే భారత ప్రభుత్వం అన్ని మొబైల్స్‌కు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తు సమయంలో ఉపయోగపడేలా.. హెచ్చరిక సేవను పరీక్షించడానికి భారత ప్రభుత్వం శనివారం ఉదయం ఈ సందేశాన్ని పంపింది.

సందేశంలో ఇలా ఉంది.. ‘‘భారతదేశం తన పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవ నిమిత్తం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. పౌరులను అప్రమత్తం చేయడం. దేశాన్ని సురక్షితం చేయడం. ఈ సందేశాన్ని అందుకున్న తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం.’’ అని భారత ప్రభుత్వం పేర్కొంది.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో 2026 మే 2న మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థను ప్రారంభించారు. పౌరులకు కీలక సమాచారాన్ని సకాలంలో చేరవేసేందుకు, సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT), భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సహకారంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్లు/కార్యదర్శులు (విపత్తు నిర్వహణ), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు, అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ మరియు హోం గార్డుల అధిపతుల 2026 వార్షిక సమావేశంలో అమిత్ షా సమక్షంలో ఈ పరీక్ష హెచ్చరిక సందేశం పంపబడింది.

ఎందుకీ పరీక్ష..
ప్రతి దేశంలోనూ.. విపత్తు లేదా క్లిష్ట పరిస్థితి సమయంలో ప్రభుత్వం పౌరులకు వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. పౌరులను త్వరగా అప్రమత్తం చేయడానికి ఫోన్ మాత్రమే ఏకైక సాధనం. ఈ కారణంగా కష్ట సమయాల్లో ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయడానికి వీలుగా.. భారత ప్రభుత్వం మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థను పరీక్షించింది.