BSF: రాడికల్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మోంచో నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులు మేఘాలయ సరిహద్దు గుండా భారతదేశానికి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ వాదనల్ని భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆదివారం తోసిపుచ్చింది. బంగ్లా చెబుతున్నదాని ప్రకారం, సరిహద్దుల్లో ఎలాంటి కదలికలు లేవని అదికారులు చెప్పారు. బంగ్లా పోలీసులు చేసిన ఆరోపణల్ని నిరాధారమైనవని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. “ఈ వాదనలు నిరాధారమైనవి మరియు తప్పుదారి పట్టించేవి” అని మేఘాలయలోని BSF ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓపీ ఓపాధ్యాయ్ అన్నారు.
ఢాకాలో హత్యకు గురైన షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులు హలుఘాట్ సెక్టార్ ద్వారా అంతర్జాతీయ సరిహద్దు దాటి మేఘాలయలోకి ప్రవేశించారని బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు అన్నారు. ఇద్దరు ప్రధాన నిందితులకు, భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు చెప్పారు. దీనిపై బీఎస్ఎఫ్ స్పందిస్తూ.. ‘‘హలుఘాట్ సెక్టార్ నుండి మేఘాలయలోకి ఏ వ్యక్తి కూడా అంతర్జాతీయ సరిహద్దును దాటినట్లు సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. BSF అటువంటి సంఘటనను గుర్తించలేదు,దా ఎటువంటి నివేదికను అందుకోలేదు’’ అని చెప్పింది.
Read Also: Sheraj Mehdi: అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పడానికి ‘ఓ అందాల రాక్షసి’: షెరాజ్ మెహదీ
ఇదే కాకుండా, హాది హంతకులకు సహకరించిన స్థానిక వ్యక్తుల్ని భారత పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. అయితే, మేఘాలయ పోలీసులు ఈ వాదనల్ని కూడా తోసిపుచ్చారు. దీనికి మద్దతు ఇచ్చే నిఘా సమచారం లేదని చెప్పారు. స్థానిక పోలీస్ విభాగాలు ఎలాంటి అనుమానాస్పద కదలికల్ని గుర్తించలేదని, కేంద్ర సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని మేఘాలయ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
ఇటీవల ఢాకాలో ఉస్మాన్ హాదిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చారు. తీవ్రగాయాలపాలైన హాదీని మెరుగైన చికిత్స కోసం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్‌కు పంపింది. చికిత్స పొందుతూ అక్కడే మరణించాడు. ఇతడి మరణం తర్వాత బంగ్లా వ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగింది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. మైమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే వస్త్ర కార్మికుడిని కొట్టి చంపారు.
