కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత్ ఈ మైలురాయి చేరుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15-18 ఏళ్ల వయసు వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 60 శాతానికి పైగా చిన్నారులు తొలి డోస్ వ్యాక్సిన్‌లను తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
