Lok Sabha Security Breach: పార్లమెంట్‌లో ఈరోజు జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి విజిటర్ల రూపంలో వెళ్లి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. పొగతో కూడిన డబ్బాలు పేల్చారు. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. సరిగ్గా డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడికి నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఇదే రోజున ఇలా ఆగంతకులు దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఈ వ్యవహారంపై విపక్షాలు, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇప్పటికే బీజేపీ ఎంపీ ఇష్యూ చేసిన విజిటర్ పాసులపై నిందితులు పార్లమెంట్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో బీజేపీ విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే, భద్రతా లోపాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయడానికి నిరాకరించాని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేతలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
Read Also: Video Viral: రైలులో మహిళతో కలిసి పోలీస్ అధికారి డ్యాన్స్.. వీడియో వైరల్
‘‘ఈ రోజు లోక్‌సభలో జరిగిన అసాధారణ సంఘటనలు, ఈ విషయంపై ప్రకటన చేయడానికి హోంమంత్రి నిరాకరించడంపై ఇండియా కూటమి పార్టీలు ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగిన రోజు ఈ భద్రత ఉల్లంఘన జరిగింది’’ అంటూ కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే డిమాండ్ చేశారు. పరిస్థితిని అనుసరించి, ఎంపీలందరికి అప్డేట్ చేస్తామని చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ తెలిపారు. అయినా విపక్ష సభ్యులు శాంతించక, సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన భద్రతా ఉల్లంఘన చాలా తీవ్రమైన విషయమని ఖర్గే ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. దీనిపై ఉభయ సభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, ఇంత పెద్ద భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు గ్యాస్ తో కూడిన డబ్బాలను ఎలా తెచ్చారు..? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
