తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తమిళగ వెట్రి కళగం (TVK), కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు గురువారం చెన్నైలో నిరసన చేపట్టనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతం లాంగ్స్ గార్డెన్ రోడ్డులో ఉన్న రామడా సర్కిల్ దగ్గర ఉదయం 10 గంటలకు నిరసన ప్రారంభం కానుంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కాంగ్రెస్ నేత బి. మాణికం ఠాగూర్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్న ఏడు పార్టీల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొననున్నారు. అక్టోబర్ 3న ఇండియా కూటమిలో టీవీకే చేరింది. జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కోరుతూ జరిగే నిరసనలో తొలిసారిగా టీవీకే పాల్గొనబోతోంది.
టీవీకే నేత, పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్మోహన్తో పాటు వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తొల్ తిరుమావళవన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ ఈ ఆందోళనకు హాజరవుతారని కాంగ్రెస్ తెలిపింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పాలా అసైథంబి, తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ నివేదిత్ ఆల్వా కూడా పాల్గొననున్నట్లు వెల్లడించింది.
విజయ్ మౌనంపై స్టాలిన్ విమర్శలు
ఎస్ఐఆర్, సీఈసీ అంశాలపై టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గతంలో బహిరంగంగా స్పందించకపోవడాన్ని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ విమర్శించారు. అక్టోబర్ 2న జరిగిన ఓ ర్యాలీలో విజయ్ను ఉద్దేశించి స్టాలిన్ ప్రశ్నలు సంధించారు. “ముఖ్యమంత్రి గారూ.. మీ భయం ఏమిటి? అసలు భయం ఏమిటి?” అని స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపీని విమర్శించడానికి విజయ్ వెనుకాడుతున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారిపై రాష్ట్ర పోలీసులు అధిక బలప్రయోగం చేశారని డీఎంకే ఆరోపించింది. మరోవైపు కాంగ్రెస్, డీఎంకే మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. అక్టోబర్ 12న తాము ఇండియా కూటమి నుంచి వైదొలిగినట్లు డీఎంకే ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు తమ పార్టీపై పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది.

