NTV Telugu Site icon

Jamiat Ulama-i-Hind: భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి.. మోదీ, మోహన్ భగవత్ లాగే మాకు హక్కుంది..

Jamiat Ulama I Hind

Jamiat Ulama I Hind

Jamiat Ulama-i-Hind: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాగే భారతదేశం తమకు చెందినది అని జమియత్-ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో మౌలానా మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ, భగవత్ లకు ఈ దేశంపై ఎంత హక్కు ఉందో మహమూద్ మదానీకి కూడా అంతే హక్కు ఉందని అన్నారు. వారి కన్నా తాను దేశం కోసం ఒక్క అంగుళం ముందే ఉంటానని వెల్లడించారు.

ఈ దేశంలో ఇస్లాం మతం అతి ప్రాచీనమైనదని, భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి అని స్పష్టం చేశారు. ఇస్లాం బయట నుంచి వచ్చిందని చెప్పడం వాస్తవం కాదని.. ఇస్లాం అన్ని మతాలలో పురాతన మతమని, హిందీ ముస్లింలకు భారత్ ఉత్తమ దేశం అని ఆయన వెల్లడించారు. తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం కాదని, కానీ హిందుత్వను తప్పుగా చూపిస్తున్నారని, ఇటీవల కాలంలో ఇది వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇది భారత స్ఫూర్తికి వ్యతిరేకం అని వెల్లడించారు.

Read Also: India Vs Australia Ist Test Live: స్పిన్ మాయాజాలం.. తొలిటెస్టులో భారత్ ఘన విజయం

బలవంతపు మత మార్పిడులకు తాము వ్యతిరేకమని, నేడు స్వచ్ఛందంగా మతం మారుతున్న వారిని కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మదానీ చెప్పారు. మతస్వేచ్ఛ ప్రాథమిక హక్కు, బలవంతంగా, మోసం, దురాశతో మత మార్పిడికి కూడా మేము వ్యతిరేకమని స్పష్టం చేశారు. నమాజ్ పై నిషేధం అంటూ కొన్ని సంస్థలు ముస్లింలను టార్గెట్ చేశాయని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్, మత స్వేచ్ఛ, ముస్లిం వ్యక్తిగత చట్టాలు, మదర్సాల ప్రతిపత్తి వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను తీసుకురావచ్చని పేర్కొన్నారు.

జమియత్ ఉలమా-ఇ-హింద్ దశాబ్ధాల క్రితం ఏర్పడిన సంస్థ. ముస్లింల పౌర, మత, సాంస్కృతిక మరియు విద్యా హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద ముస్లిం సంస్థగా ఉంది. జమియత్ ఇస్లాం యొక్క దేవబంది భావజాలాన్ని విశ్వసిస్తుంది. ముస్లింల సామాజిక-రాజకీయ మరియు మతపరమైన అంశాలను చర్చిస్తుంది.