India-Belgium: పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్‌కు బెల్జియం హామీ

  • భారత్‌లో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ పర్యటన
  • ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశం
  • పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు
  • భారత్‌కు బెల్జియం హామీ
Modi

Modi

బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బెల్జియం మరింత బలోపేతం చేసుకుంంది. పాకిస్థాన్‌తో సైనిక పరికరాలు, రక్షణ సాంకేతికతకు సంబంధించిన సహకారం చేపట్టబోమని భారత్‌కు హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ది ప్రింట్ కథనాన్ని ఉటంకిస్తూ రక్షణ, భద్రతా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సెప్టెంబర్ 3న ఢిల్లీలో ప్రధాని మోడీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సమావేశమయ్యారు. మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బెల్జియం రక్షణ, విదేశీ వాణిజ్య మంత్రి థియో ఫ్రాంకెన్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అయితే భారత్-బెల్జియం సంయుక్త ప్రకటనలో గానీ.. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో గానీ పాకిస్థాన్ ప్రస్తావన లేదు. అలాగే బెల్జియం రక్షణ ఎగుమతులపై ఏదైనా నిర్దిష్ట దేశానికి సంబంధించిన ఆంక్షలను కూడా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ హామీ ఎంతకాలం అమల్లో ఉంటుంది. ఎలా అమలు చేస్తారనే దానిపై కూడా అధికారిక వివరాలు వెల్లడికాలేదు.

ఉగ్రవాదంపై భారత్‌కు బెల్జియం మద్దతు

ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే భారత్ పోరాటానికి బెల్జియం మద్దతు ప్రకటించినట్లు సంయుక్త ప్రకటన తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడిని బెల్జియం ఖండించింది. ఉగ్రవాదులు, వారికి నిధులు అందించే వ్యక్తులు, సంస్థలు, వారికి ఆశ్రయం కల్పించే వ్యవస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాద నిరోధక అంశాలపై సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని అంగీకరించాయి.

గతంలో పాకిస్థాన్‌తో బెల్జియం రక్షణ సంబంధాలు

గతంలో బెల్జియం పాకిస్థాన్‌కు సైనిక విమానాలను సరఫరా చేసింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) డేటాను ఉటంకిస్తూ ది ట్రిబ్యూన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో బెల్జియం ఏడు ఉపయోగించిన C-130H రవాణా విమానాలను పాకిస్థాన్‌కు విక్రయించింది. 2003లో పాకిస్థాన్ బెల్జియం నుంచి F-16 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. అయితే అమెరికాలో తయారైన ఈ విమానాలను బదిలీ చేయడానికి వాషింగ్టన్ అనుమతి అవసరం కావడంతో ఆ ప్రతిపాదిత ఒప్పందం ముందుకు సాగలేదు. SIPRI ప్రకారం.. 2021-25 మధ్యకాలంలో పాకిస్థాన్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ప్రధాన ఆయుధాల దిగుమతిదారుగా ఉంది. ఆ కాలంలో పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 80 శాతం చైనా నుంచి వచ్చాయి. టర్కియే 7 శాతం, నెదర్లాండ్స్ 4.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అనుమతులు ఎలా?

బెల్జియంలో రక్షణ రంగ ఎగుమతులకు అనుమతులు ఇచ్చే విధానం వికేంద్రీకృతంగా ఉంటుంది. 2003 నుంచి ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులు, ద్వంద్వ వినియోగ వస్తువుల దిగుమతి, ఎగుమతి, రవాణాకు బ్రస్సెల్స్, ఫ్లెమిష్, వాలోన్ ప్రాంతీయ ప్రభుత్వాలు లైసెన్సులు జారీ చేస్తున్నాయి. అయితే బెల్జియం సైన్యం, ఫెడరల్ పోలీసులకు సంబంధించిన కొన్ని పరిమిత మినహాయింపులు ఉన్నాయి.

యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా బెల్జియం.. సైనిక ఎగుమతులకు సంబంధించిన ఈయూ ఉమ్మడి నిబంధనలకు లోబడి ఉంటుంది. ఆయుధాల ఎగుమతులకు అనుమతి ఇచ్చే సమయంలో ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రవాదం, మానవ హక్కులు, ఆయుధాలు దారి మళ్లే ప్రమాదం వంటి అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

భారత్-బెల్జియం మధ్య విస్తృత రక్షణ సహకారం

బార్ట్ డి వెవర్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకం చేశాయి. దీని ద్వారా క్రమం తప్పకుండా సైనిక పరస్పర మార్పిడి, సిబ్బంది స్థాయి చర్చలు, శిక్షణ, పరిశోధన సహకారం, రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాలను ఏర్పాటు చేయనున్నారు. 2025 మార్చిలో ఇరు దేశాల రక్షణ మంత్రులు కుదుర్చుకున్న అవగాహనకు ఈ కొత్త రక్షణ సహకార వ్యవస్థ మరింత బలం చేకూరుస్తుందని సంయుక్త ప్రకటన పేర్కొంది.

అదే సమయంలో భారత, బెల్జియం కంపెనీలు కూడా 10 ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ది ప్రింట్ తెలిపింది. వీటిలో మందుగుండు సామగ్రి, రాకెట్లు, సముద్ర గనుల గుర్తింపు-నిరోధక వ్యవస్థలు, డ్రోన్ వ్యతిరేక సాంకేతికత, ఎలక్ట్రో-ఆప్టిక్స్, ఆర్మర్డ్ వాహన వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి.