Site icon NTV Telugu

Cheetahs to India: చీతాలు వచ్చేశాయ్‌.. చీతా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Cheetahs

Cheetahs

Cheetahs to India: నమీబియా నుంచి 8 చీతాలతో కూడిన ప్రత్యేక కార్గో బోయింగ్ 747 చార్టర్డ్ విమానం శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 72వ జన్మదినం సందర్భంగా నేడు చిరుతలను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయనున్నారు.ఏడు దశాబ్దాల తర్వాత నమీబియా నుంచి తరలించబడిన ఎనిమిది కొత్త చిరుతలను స్వాగతించడానికి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చీతాలను(5ఆడ, 3మగ) పార్కులోకి విడిచిపెడతారు.

ప్రధాని మోడీ మహారాజ్‌పుర ఎయిర్‌బేస్‌కు బయల్దేరారు. అక్కడి నుంచి కునో నేషనల్‌ పార్క్‌కు వెళ్లి చీతా ప్రాజెక్టు్ను ప్రారంభించనున్నారు. మూడు చీతాలను క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేస్తారు. నమీబియా నుంచి మొత్తం 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. ఇప్పటికే అంతరించిపోయిన చీతా జాతిని పునరుద్ధరించడం చారిత్రాత్మకమైన చర్య అని, ఇది రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచుతుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అంతకుముందు, ఎన్‌క్లోజర్ నంబర్ వన్ నుంచి రెండు చిరుతలను పీఎం మోడీ విడుదల చేస్తారని, ఆ తర్వాత 70 మీటర్ల దూరంలో, రెండవ ఎన్‌క్లోజర్‌లో ప్రధాని మరో చిరుతను విడిచిపెడతారని చీతా ప్రాజెక్ట్ చీఫ్ ఎస్‌పీ యాదవ్ చెప్పారు. మిగిలిన చిరుతలను వాటి కోసం తయారు చేసిన క్వారంటైన్‌లో విడిచిపెడతారు.నమీబియా నుంచి బోయింగ్ 747 చార్టర్డ్ కార్గో విమానం ద్వారా చిరుతలను దేశంలోకి తీసుకువస్తున్నామని, ఇది భారత్‌లో దిగుతుందని యాదవ్ చెప్పారు.

Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..

వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ఒకటి ‘ప్రాజెక్ట్ టైగర్’, పులుల సంరక్షణకు మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు కూడా దోహదపడింది.దీనికి కొనసాగింపుగా, చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక అడుగు ముందుకేసి ఒక మైలురాయి. ఈ ప్రాజెక్టుతో దాదాపు 74ఏళ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించబోతున్నాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చారు.

Exit mobile version