Balochistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిణామాలు కీలకంగా మారాయి. చాలా ఏళ్లుగా ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు చేస్తున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ ఇటీవల స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. తాము పాకిస్తానీలము కాదని, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కోరింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. వరస దాడుల్లో వారిని హతమారుస్తున్నారు.
Read Also: Rohit Sharma: వాంఖడేలో ‘రోహిత్ శర్మ’ స్టాండ్ ఆవిష్కరణ.. క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్
హింగ్లాజ్ మాత ఆలయం:
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన హిందూ ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని ‘‘హింగ్లాజ్ మాతా’’ ఆలయంపై ఆసక్తి నెలకొంది. హిందూ మతంలోని 51 శక్తి పీఠాల్లో హింగ్లాజ్ శక్తిపీఠ్ కూడా ఒకటి. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మారుమూల కొండల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని హిందువులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏడాదిలో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ మూడు రోజులు ఆలయానికి హాజరైన వారి పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. భారత్-పాక్ విభజన ముందు ఈ ఆలయానికి ఉపఖండంలోని హిందువులు వెళ్లేవారు. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా హింగ్లాజ్ మాతని ‘‘నానీ మందిర్’’గా ఎంతో గౌరవంగా చూస్తారు.
కటాస్ రాజ్ ఆలయం:
ఇదే విధంగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని చక్వాల్ లోని కటాస్ రాజ్ శివాలయం కూడా చారిత్రాత్మక ప్రదేశంగా ఉంది. విభజన తర్వాత, ఈ ఆలయం హిందువులకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఆలయంలో కటాస్ కుండ్ అనే పవిత్ర సరస్సు ఉంది. ఇది శివుడి కన్నీళ్ల నుంచి ఏర్పడిందని నమ్ముతారు. కటాస్ రాజ్ ఆలయం చారిత్రాత్మకంగా హిందూ విద్య, తత్వ శాస్త్రాలకు కేంద్రంగా ఉండేది. పాండవులు తమ బహిష్కరణ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెబుతుంటారు. ఆది శంకారాచార్య బోధనలు ఈ కటాస్ రాజ్ ఆలయంలో ముడిపడి ఉన్నాయని నమ్ముతారు. కటాస్ రాజ్ నిర్మాణం హిందూ బౌద్ధ శైలుల మిశ్రమం.
