NTV Telugu Site icon

Waqf Board: వక్ఫ్ బోర్డు సంస్కరణలు.. 44 సవరణలు.. మహిళలు తప్పనిసరి..

Waqf Board

Waqf Board

Waqf Board: వక్ఫ్ బోర్డు ‘‘అపరిమిత అధికారాలకు’’ బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్తగా చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్యను కొందరు ముస్లింలు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు బిల్లులను తీసుకురావడం ద్వారా చట్టానికి 40కి పైగా సవరణలు ప్రవేశపెట్టబడనున్నట్లు తెలుస్తోంది. వర్షకాల సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులతో వక్ఫ్ బోర్డులో సంస్కరణలు ప్రారంభించే లక్ష్యంతో కేంద్రం ఉంది. దీంతో పాటు వక్ఫ్ ప్యానెల్‌లో ఇద్దరు మహిళా సభ్యులు ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేయనుంది.

సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల్ని నమోదు చేయడంతో పాటు బోహ్రా కమ్యూనిటీ ముస్లిం హక్కుల పరిరక్షణ ప్రతిపాదిత సవరణలు ఉండబోతున్నాయి. ఏదైనా ఆస్తిని ‘‘వక్ఫ్ ఆస్తి’’గా ప్రకటించే అధికారాన్ని బోర్డుకు తొలగించాలని సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం వక్ఫ్ చట్టంలో ఉన్న సెక్షన్ 40ని రద్దు చేయనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ప్రకారం, వక్ఫ్ చట్టం-1923 ఉపసంహరించబడుతుంది, 1995 వక్ఫ్ చట్టం నిర్మాణంలో మెరుగైన పనితీరు, నిర్వహణ కోసం 44 సవరణలు ప్రవేశపెట్టడం ద్వారా మార్చబడుతుంది. ప్రతిపాదిత సవరణలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర బోర్డులలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచనున్నారు.

Read Also: Karan Bhushan Singh: వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు ఏమన్నారంటే?

కొత్త చట్టంలో ప్రతిపాదిత కీలకమైన మార్పుల్లో వక్ఫ్ చట్టం 1995 పేరుని ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత మరియు అభివృద్ధి చట్టం, 1995గా మార్చడంతో పాటు షియా, సున్నీ, బోహ్రా, అఘఖానీ ఇతర వెనకబడిన తరగతులతో సహా అన్ని ముస్లిం వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా మార్పులు చేస్తున్నారు. బోహ్రా, అఘాఖానీ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కోసం ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ఔకాఫ్ ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం మహిళలు, ముస్లిమేతరకు ప్రాతినిధ్యం ఉంటుంది.

ప్రతిపాదిత మార్పులకు వివిధ దర్గాల ముఖ్యుల నుంచి కూడా మద్దతు లభించింది. మంగళవారం సాయంత్రం మైనారిటీ నేతలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలుసుకుని చట్టానికి మద్దతు ఇచ్చారు. ‘‘భారతదేశంలోని వివిధ దర్గాల నుండి అత్యంత గౌరవనీయమైన & ప్రముఖ సజ్జదానాశిన్‌లతో కూడిన ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాషిన్ కౌన్సిల్ (AISSC) యొక్క ప్రతినిధి బృందం అజ్మీర్ దర్గా యొక్క ప్రస్తుత ఆధ్యాత్మిక అధిపతి చైర్మన్ & వారసుడు శ్రీ సయ్యద్ నసెరుద్దీన్ చిష్టీ నేతృత్వంలో నన్ను కలిశారు. ’’ అని కిరణ్ రిజిజు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నివేదికల ప్రకారం వక్ఫ్ బోర్డు దాదాపుగా 8.7 లక్షల ఆస్తులుల ఉన్నాయి. 9.8 లక్షల ఎకరాల భూమి ఉంది.