బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు షాకిచ్చారు. అక్టోబర్ 28 లోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ముంబైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భాగస్వామి, నటి లేఖా వాషింగ్టన్, బంధువు జైన్ మేరీ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్, జైన్ మేరీ ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ భారత పౌరుడు కాదని.. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ పౌరుడిగా ఉంటూ నిరసనలో పాల్గొన్నారనే కారణంతో ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ముంబై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసులో.. ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం. అయితే నోటీసులోని పూర్తి వివరాలు, చర్యకు సంబంధించిన అధికారిక కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామంపై ఇమ్రాన్ ఖాన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు.

