Site icon NTV Telugu

Important Deadlines: పాన్-ఆధార్ లింకింగ్ ,ITR, రేషన్ కార్డు e-KYC పూర్తి చేశారా.. ఈ నెల 31 వరకే లాస్ట్ డేట్

Untitled Design (3)

Untitled Design (3)

2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఆర్థిక మరియు ప్రభుత్వ సంబంధిత చర్యలకు సంబంధించిన కీలక గడువులు దగ్గరపడుతున్నాయి. ముఖ్యంగా ITR దాఖలు, పాన్-ఆధార్ లింకింగ్, రేషన్ కార్డు e-KYC వంటి పనులు ఇంకా పూర్తి చేయనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గడువులు ముగిసిన తర్వాత అవకాశాలు ఉండకపోవచ్చని, ఉన్నా భారీ జరిమానాలు విధించబడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పాన్-ఆధార్ లింకింగ్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలు హోల్డ్‌లో పడే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ పనులను సమయానికి పూర్తి చేయటం అత్యంత అవసరం.

మీరు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను గడువులోపు దాఖలు చేయకపోయినా, డిసెంబర్ 31 వరకు బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడవ విడత ముందస్తు పన్ను చెల్లించే చివరి తేదీ డిసెంబర్ 15. ఈ తేదీని మిస్ అయితే సెక్షన్ 234C ప్రకారం వడ్డీ మరియు జరిమానా వర్తిస్తాయి. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే రూ.1,000 జరిమానా, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం కూడా ఉండదు.

పాన్–ఆధార్ లింకింగ్ కోసం చివరి తేదీ డిసెంబర్ 31, 2025. ఈ తేదీలోపు లింక్ చేయకపోతే పాన్ చెల్లుబాటు కాకపోవడంతో మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఇతర కీలక బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. ఈ ప్రక్రియను ఆదాయపు పన్ను వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.

రేషన్ కార్డు e-KYC ప్రక్రియ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో జరుగుతోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ధాన్యాలు పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా డిసెంబర్ 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి.

సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కూడా డిసెంబర్ 31 అత్యంత కీలకమైన తేదీ. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పట్టణ మరియు గ్రామీణ) కింద గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందడానికి దరఖాస్తు చేసుకునే గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది.

Exit mobile version