NTV Telugu Site icon

IMF: భారత్‌కి తిరుగులేదు.. యూఎస్, చైనాల కన్నా ఎక్కువ జీడీపీ వృద్ధిరేటు..

Gdp

Gdp

IMF: భారత ఆర్థిక వ్యవస్థకు తిరుగు లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) రిపోర్టు వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఐఎంఎఫ్ ఈ నివేదికను ద్వారా గుడ్‌న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ(GDP) వృద్ధిరేటు 7 శాతానికి సవరించింది. ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ప్రైవేట్ వినియోగం మెరుగుపడటంతో 2024-25కి భారత వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7 శాతానికి ఐఎంఎఫ్ పెంచించింది. 2025లో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని చెప్పింది.

‘‘వరల్డ్ ఎకానామిక్ ఔట్‌లుక్’’ తాజా అప్డేట్‌లో అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వృద్ధి రేటు అంచనాలను సవరించింది. ఆసియాలో భారత్, చైనాలు బలమైన ఆర్థిక వృద్ధిరేటను నమోదు చేస్తున్నాయి. మరోవైపు చైనా మొదటి త్రైమాసికంలో ప్రైవేట్ వినియోగం, బలమైన ఎగుమతులు పుంజుకోవడంతో వ‌ృద్ధి రేటు 2024-25కి 5 శాతానికి సవరించింది. 2025లో 4.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

Read Also: Prajwal Revanna’s Father: నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయాలి.. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ..

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చూసుకున్నా, అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం అత్యధిక జీడీపీ వృద్ధిరేటును సాధిస్తుందని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన మార్కెట్లుగా చెప్పబడుతున్న అమెరికాతో పాటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, యూకే, కెనడా, స్పెయిన్ వంటి దేశాలు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ వృద్ధిరేటును కనీసం 3 శాతానికి మించి నమోదు చేయలేకపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్, చైనా మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, గత నెలలో ప్రపంచ బ్యాంక్ భారతవృద్ధి రేటు అంచనా 6.6 శాతం వద్ద ఉంటుందని చెప్పింది. ఆర్బీఐ అంచనాను 20 బేసిక్ పాయింట్ల మేర 7.2 శాతానికి సంవరించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాని విస్తరణ వేగం మితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి పెరుగుదల, బలమైన సేవల కార్యకలాపాలతో బలమైన దేశీయ డిమాండ్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. 2024 నుండి 2026 వరకు ఆర్థిక సంవత్సరానికి సగటున 6.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. దక్షిణాసియాను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారుస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.