కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందారు. ఆకాశం వైపు చూస్తున్న కర్షకులకు తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశమంతా వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు రాష్ట్రాలను ఐఎండీ హెచ్చరించింది.
ఇక జూన్ 26 నాటికి ఢిల్లీకి రుతుపవనాలు చేరతాయని.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Danush : ధనుష్ టాలీవుడ్ టార్గెట్ క్లియర్.. మరోసారి హిట్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ !
ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూరత్‌లో పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో గోదావరి నది పొంగడంతో నాసిక్‌లోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. అలాగే కేరళలోని అనేక జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఇది కూడా చదవండి: Abhishek Bachchan : ఓటీటీలో అదరగొడుతున్న అభిషేక్ బచ్చన్..
ఇక దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక జమ్మూ ప్రాంతంలో మాత్రం వేడిగాలులు ఉంటాయని చెప్పింది. జూన్ 30 వరకు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కొంకణ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సౌరాష్ట్ర మరియు కచ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక జూన్ 28 వరకు బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు కురవనున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో రాబోయే ఏడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడు, అండమన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది.
