దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. ఢిల్లీ నుంచి యూపీ వరకు.. గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు.. ఇలా 19 రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
రేపు దేశంలోని మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. ఇక ఢిల్లీలో రేపు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి వర్షపాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది
ఇక జూలై 31వ తేదీన అహ్మదాబాద్‌తో సహా గుజరాత్‌లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌తో సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ అశోక్ కుమార్ దాస్ తెలిపారు. అసాధారణ వర్షపాతం కురుస్తుందని కూడా ఆ శాఖ అంచనా వేసింది.
రాజస్థాన్‌లో కూడా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బీహార్‌లోని పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. జూలై 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

