Site icon NTV Telugu

Agnipath: అగ్నిపథ్‌కు అనూహ్య స్పందన.. వాయుసేన చరిత్రలో తొలిసారి..

Agnipath Scheme Applications

Agnipath Scheme Applications

త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో ఖాళీలకు దాదాపు 7.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారత వాయుసేన చరిత్రలో ఈ మేర దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన 10 రోజుల తర్వాత జూన్ 24న భారత వాయుసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రకియ జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు. ఇప్పటివరకు చరిత్రలో 6,31,528 దరఖాస్తులే అత్యధికం కాగా.. ఇప్పుడు భారత వాయుసేనలో అగ్నిపథ్ స్కీం ద్వారా 7,49,899 దరఖాస్తులు వచ్చినట్లు భారత వాయుసేన ప్రకటించింది.

Agnipath: నేవీ అగ్నివీర్ సైలర్ పోస్టుల్లో 20 శాతం మహిళలే..

కొత్తగా ప్రారంభించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగినప్పటికీ ఇన్ని దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారడం గమనార్హం. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోబోమని జూన్ 19న లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి స్పష్టం చేశారు. యువత వీధుల్లోకి వచ్చి సమయాన్ని వృథా చేసుకోకుండా సన్నద్ధం కావడం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.

సైనిక రిక్రూట్ మెంట్ కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ స్కీం కింద త్రివిధ దళాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ సైలర్‌ పోస్టుల్లో 20 శాతం మంది మహిళలు ఉండనున్నారు. సైలర్‌ ఉద్యోగాల్లో మహిళలను భర్తీ చేయడం ఇదే ప్రథమం. అగ్నిపథ్‌ పథకం అమల్లోకి వచ్చిన తరువాత మొదటి బ్యాచ్‌లో 3,000 మంది సైలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్టు నేవీ అధికారులు వెల్లడించారు. నావికా దళం ప్రకటించిన అర్హతలను వారు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఈ దళంలో వేర్వేరు శాఖలకు కేటాయించనున్నారు.

ఈ పోస్టుల కోసం ఇంతవరకు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలిసారి నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అవసరమైతే వారిని యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్లు పేర్కొంది.

Exit mobile version