Site icon NTV Telugu

WFI: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బ్రిజ్ శరణ్ సన్నిహితుడు .. ఏడుస్తూ రెజ్లింగ్‌కి గుడ్‌బై చెప్పిన సాక్షి మాలిక్..

Wfi

Wfi

WFI: మహిళా రెజ్లర్లపై, మైనర్లపై లైంగిక దాడి చేశాడని మాజీ రెజ్లింగ్ ఫెడరేషర్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు పెద్ద ఉద్యమమే చేశారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బ్రిజ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించారు.

గెలిచిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. మచ్చలేని వ్యక్తి బ్రిజ్ శరణ్ సింగ్‌‌ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని అన్నారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రత్యర్థి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ విన్నర్, రెజ్లర్ అనితా షియోరాన్‌పై పోటీ సంజయ్ సింగ్ గెలుపొందారు. 47 ఓట్లలో 40 ఓట్లను సంజయ్ సింగ్ సాధించారు. ప్రెసిడెంట్‌తో పాటు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, నలుగురు ఉపాధ్యక్షులు, సెక్రటరీ జనరల్‌, ట్రెజరర్‌, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలు, ఐదుగురు రెజ్లింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎన్నికయ్యారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘పిక్‌పాకెట్’ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు..

ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ గెలుపుపై మరోసారి బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్, వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది వీరంతా బ్రిజ్ శరణ్‌ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేశారు. ఒలింపిక్ విజేత, ప్రఖ్యాత రెజ్లర్ సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్‌ని వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా సంజయ్ సింగ్ గెలుపుపై నిరాశ వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎణ్నికయ్యారు.. మహిళ రెజ్లర్లు వేధింపులు ఎదుర్కొంటారు అని, దేశంలో న్యాయాన్ని ఎలా కనుగొనాలో తెలియడం లేదని వినేష్ ఫోగట్ అన్నారు. మా రెజ్లింగ్ కెరీర్ అంధకారంలో ఉందని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని చెప్పారు.

ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దురద‌ృష్టకరమని వ్యాఖ్యానించారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, బ్రిజ్ శరణ్ సహాయకుడు అధ్యక్షుడయ్యాడని అన్నారు. రెజ్లింగ్ బాడీకి మహిళా చీఫ్ కావాలని కోరుకున్నామని సాక్షి మాలిక్ అన్నారు. కానీ అలా జరగలేదని, తాను రెజ్లింగ్‌ని విడిచిపెడుతున్నానని, తన షూలను టెబుల్‌పై ఉంచి ప్రకటించారు.

Exit mobile version