NTV Telugu Site icon

Siddaramaiah: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తప్పికొడతాం

Siddaramaiah

Siddaramaiah

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదన్నారు. గవర్నర్ విచారణకు ఆదేశించడంపై కేబినెట్ భేటీలో చర్చించామని… గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్‌, పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా తనకు అండగా ఉన్నారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.

గవర్నర్ తన సెక్రటరీ ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన లేఖను పంపారని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఈ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు అండగా ఉందన్నారు. అసలు కేసే లేని చోట వివాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై మేం న్యాయపరంగా ముందుకు వెళ్తామని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా పోరాడతామని శివకుమార్ మీడియాతో అన్నారు.

ముడా కుంభకోణంలో సిద్ధూ సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై గతంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తనకు, తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. తమ భూమినే ముడా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని అన్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా.. అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని వెల్లడించారు.