Hyderabad Tops India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. దేశంలోని టాప్-8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో కావటం విశేషం. షామింగ్ మాల్స్‌లో లీజుకి ఇచ్చే స్థూల విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్‌ఏ)ను ప్రతిపదికగా తీసుకొని ఒక జాబితా రూపొందించారు. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్‌ఏ కలిగిన షాపింగ్ మాల్స్, అవి ఉన్న నగరాలను గ్రేడ్-ఎలో చేర్చారు. లక్ష నుంచి లక్షన్నర లోపు జీఎల్‌ఏ గల సిటీలను గ్రేడ్-బిలో, లక్ష కన్నా తక్కువ జీఎల్‌ఏ ఉన్న నగరాలను గ్రేడ్-సిలో చేర్చారు.
హైదరాబాద్‌లో మొత్తం 72 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్ ఏరియా అందుబాటులో ఉండగా అందులో 52 శాతం వాటా (39 లక్షల చదరపు అడుగులు) జీఎల్‌ఏనే కావటం గమనార్హం. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలలకు సంబంధించిన ఈ రిటైల్ రిపోర్టును నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ లేటెస్టుగా రూపొందించింది. ఈ నివేదిక పేరు.. ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022 – రీఇన్వెంటింగ్ ఇండియన్ షాపింగ్ మాల్స్’. హైదరాబాద్‌లోని గ్రేడ్-బి, గ్రేడ్-సి షాపింగ్ మాల్స్ వరుసగా 21 శాతం(15.7 లక్షల చదరపు అడుగులు) మరియు 27 శాతం (20.2 లక్షల చదరపు అడుగులు) ఉన్నాయి.
గ్రేడ్-ఎలో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (45 శాతం వాటా), ముంబై (43), బెంగళూరు (42), చెన్నై (39), అహ్మదాబాద్ (30), పుణె (19 శాతం వాటా) ఉన్నాయి. ఇండియా మొత్తమ్మీద ఉన్న 9 కోట్ల 22 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్స్ జీఎల్‌ఏలో 3వ వంతుకు పైగా వాటా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానిదే కావటం గమనార్హం. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తమ్మీద ఉన్న మాల్స్ స్పేస్ ఏరియాలో 39 శాతాన్ని మాత్రమే గ్రేడ్-ఎలో చేర్చారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం 217 షాపింగ్ మాల్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోగా వాటిలోని టాప్-8 సిటీల్లో 52 షాపింగ్ మాల్స్‌కు సంబంధించి 3 కోట్ల 60 లక్షల చదరపు అడుగుల జేఎల్‌ఏ ఉంది.
2019 డిసెంబర్‌కి ముందు మొత్తం 255 మాల్స్ ఉండగా వాటిలోని 7 కోట్ల 74 లక్షల చదరపు అడుగుల జీఎల్‌ఏ మాత్రమే అందుబాటులో ఉండేది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశం మొత్తమ్మీద టాప్-8 సిటీల్లో నంబర్ -1 పొజిషన్‌ను సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు. వాణిజ్యపరంగా భాగ్య నగరం భారతదేశానికే తలమానికంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
