Site icon NTV Telugu

Domestic Violence: తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింస ఎలా అవుతుంది.? భార్య పిటిషన్ కొట్టేసిన కోర్టు..

Law News

Law News

Domestic Violence: తన భర్త, అత్తామామలపై భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. మహిళ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి తన తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబడదని చెప్పింది. అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి కోర్టు) ఆశిష్ అయాచిత్, మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో.. మహిళ ఫిర్యాదు అస్పష్టంగా ఉందని, భర్త, అత్తామామలు గృహ హింస వేధింపులకు పాల్పడినట్లు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ గృహ హింస నుంచి రక్షించాలని, తనకు పరిహారంగా డబ్బు ఇవ్వాలని ఫిర్యాదు చేసింది. తన తల్లి మానసిక ఆరోగ్యాన్ని బయటపెట్టకుండా తనను పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించింది. తన అత్తగారు తాను ఉద్యోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని, తనను వేధించేవారని, భర్త మరియు అతని తల్లి తనతో గొడవ పడేవారని మహిళ పేర్కొంది. తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్నాడని, అతను సెలవుపై ఇండియా వచ్చినప్పుడల్లా, తన తల్లి వద్దకు వెళ్లేవాడని, ప్రతీ ఏడాది రూ. 10,000 పంపేవాడని, ఆమె కంటి ఆపరేషన్ కోసం కూడా ఖర్చు పెట్టాడని సదరు మహిళ తెలిపింది. తన అత్తామామల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వేధింపుకు గురిచేసేవారని ఆరోపించింది.

Read Also: Botsa Satyanarayana: నాకు సీఎం అయ్యే ఛాన్స్ వస్తే.. చిరంజీవి అడ్డుపడ్డారు..

అయితే, కోడలు చేస్తున్న ఆరోపణల్ని అత్తామామలు కొట్టిపారేశారు. తను భర్తగా ఆమె ఎప్పుడూ అంగీకరించలేదని ఆమె భర్త ఫిర్యాదు ఆరోపించాడు. ఆమె క్రూరత్వం కారణంగా తాను ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని చెప్పాడు. ఎటువంటి సమాచారం లేకుండా తన భార్య తన NRE (నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) ఖాతా నుండి ₹ 21.68 లక్షలు విత్‌డ్రా చేసిందని, ఆ మొత్తంతో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని కూడా అతను ఆరోపించాడు. మహిళ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే, ఆమె ఇతరుల సాక్ష్యాలు నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టేసింది. భరణాన్ని రద్దు చేసింది.

ఈ పరిణామంలో మహిళ ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత మహిళ వాదనలు అస్పష్టంగా ఉన్నాయని, ఆమె గృహ హింసకు గురికాలేదని, తల్లికి డబ్బులు ఇవ్వడం, సమయాన్ని కేటాయించడం గృహ హింస కిందకు రాదని కోర్టు పేర్కొంది. విడాకులు కోరుతూ భర్త, నోటీసులు జారీ చేసిన తర్వాతే మహిళ ఈ రకమైన ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని గుర్తు గుర్తించింది. ఆమె గృహ హింస నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి అర్హత లేదని చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పులో సెషన్స్ కోర్టు జోక్యం చేసుకోవాల్సి అవసరం లేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Exit mobile version