Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..

  • భారతీయుల పడవపై సౌదీ అరేబియా దాడి..
  • జుకార్ ద్వీపం సమీపంలో ఘటన జరిగినట్లు హౌతీల ఆరోపణ..
  • 14 మంది భారతీయుల్ని రక్షించేందుకు హౌతీల చర్యలు..
Saudi Houthi War

Saudi Houthi War

Saudi-Houthi war: ఎర్ర సముద్రంలో భారతీయులతో వెళ్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసినట్లు ప్రకటించింది. జుకార్ ద్వీపం సమీపంలో 14 మంది భారతీయ పౌరులను తీసుకెళ్తున్న పడవపై దాడి జరిగినట్లు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు గురువారం తెలిపారు. పడవలో ఉన్న వారిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిది బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు. ఎర్ర సముద్రంలో జుకార్ ద్వీపం సమీపంలో ఒక భారతీయ పడవను లక్ష్యంగా చేసుకుని సౌదీ దాడి చేసినట్లు యాహ్యా సరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

14 మందిని రక్షించేందుకు హౌతీలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సౌదీ చేసిన దాడిని నిర్లక్ష్యపూరితమైందిగా హౌతీలు అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు కలిగిస్తాయని యహ్యాసరీ అన్నారు. సౌదీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.

దాడి జరిగిన ప్రాంతం అత్యంత కీలకమైన జలసంధి బాబ్-అల్-మాండెబ్‌కు సమీపంలో ఉంటుంది. ఇది ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఎడన్‌‌కు అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి కలుపుతుంది. అంతర్జాతీయ నౌకాయానానికి కీకలంగా ఉంది. ప్రస్తుతం పడవలో ఉన్న 14 మంది భారతీయుల పరిస్థితి, సహాయక చర్యల పూర్తి వివరాలు విడుదల కాలేదు. ఈ దాడిపై, హౌతీ వాదనపై సౌదీ అరేబియా ఎలాంటి ప్రకటన చేయలేదు.