Himanta Sarma: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్న ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోందని హిమంత శర్మ ఆరోపించారు. ప్రత్యక్షంగా ఎవరి పేరు చెప్పకుండా బుధవారం నుంచి వరసగా ఎక్స్‌లో ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్నారు. భారతదేశం అభ్యంతరం చెప్పినప్పటికీ 2015లో పాకిస్తాన్ హైకమిషనర్‌తో గౌరవ్ గొగోయ్ సమావేశం కావడాన్ని కూడా ఆయన విమర్శించారు.
అయితే, ఈ ఆరోపణపై కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ స్పందించారు. ఈ ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. 2026 అస్సాం ఎన్నికల ముందు తనపై తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ‘‘ఎలిజబెత్ కోల్బర్న్’’ ఉంది. 2013లో గొగోయ్ ఈమెను అమెరికాలో కలిసిన తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. లిజబెత్ 2011-2015 మధ్య క్లైమేట్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (CDKN)తో పనిచేశారు. దీనికి ఎక్కువగా పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఆమె పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ మాజీ సలహాదారు, ఐఎస్ఐతో సంబంధం ఉన్న అలీ తౌకీర్ షేక్ కింద పనిచేశారని బీజేపీ ఆరోపించింది.
Read Also: Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..
“ఐఎస్ఐ సంబంధాలు, బ్రెయిన్‌వాష్ మరియు రాడికలైజేషన్ కోసం యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లడం మరియు గత 12 సంవత్సరాలుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి ఆరోపణలకు సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి” అని హిమంత తన ట్వీట్స్‌లో డిమాండ్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి విదేశీ భార్య 12 ఏళ్లుగా విదేశీ పౌరసత్వాన్ని నిలుపుకునేందుకు అనుమతించడం చాలా ఎక్కువ సమయం, దేశం పట్ల విధేయతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని గొగోయ్ భార్యని ఉద్దేశించి హిమంత అన్నారు.
ఎలిజబెత్ పనిచేసిన సిడికెఎన్ భాగస్వామి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుండి నిధులు పొందారని ఆరోపించడం ద్వారా శర్మ ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ సోరోస్‌తో కలిసి పనిచేస్తుందని బిజెపి పదేపదే ఆరోపిస్తోంది. గోగోయ్ పాకిస్తాన్ దౌత్యవేత్తతో సమావేశం కావడంపై గురువారం హిమంత బిశ్వశర్మ ఫైర్ అయ్యారు. 2015లో 2015లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు అప్పటి హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను కలవడానికి వెళ్ళిన విషయాన్ని ప్రస్తావించారు.
‘‘పాకిస్తాన్ హైకమిషన్ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని ముఖ్యంగా హురియత్ కాన్ఫరెన్స్‌లో దాని ప్రమేయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఈ సమావేశం జరిగింది. ఆందోళనల్ని విస్మరించి పాకిస్తాన్ అధికారులను కలవడానికి ఎంపీ 50-60 మంది భారతీయ యువకుల్ని తీసుకెళ్లారు’’అని శర్మ ట్వీట్ చేశారు.