Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్‌ గాంధీపై హిమంత సెటైర్లు..

  • రాహుల్ గాంధీ ‘‘ఎప్పటికీ యువ నాయకుడే’’ అంటూ సెటైర్లు..
  • కాంగ్రెస్ ప్రతీ ఏడాది కొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది..
  • 57 ఏళ్ల వ్యక్తి జెన్-జీగా చూపించడంపై అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు..
Himanta

Himanta

Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీని కొత్తగా యువ నాయకుడిగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆయన ‘‘ఎప్పటికీ యువ నాయకుడే’’ అంటూ ఎద్దేవా చేశారు. గుహవాటితో శుక్రవారం మీడియాతో మాట్లాడిన హిమంత.. 57 ఏళ్ల వ్యక్తిని యువ నాయకుడిగా, జెన్-జీగా చూపించడాన్ని ప్రశ్నించారు. తన వయసు కూడా 57 ఏళ్లే అని, తాను కూడా ఇప్పుడు జెన్-జీ అని చెప్పుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతీసారి రాహుల్ గాంధీని తెరపైకి తీసుకువస్తోందని హిమంత అన్నారు.

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రతీసారి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తారని, తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆయనను కొత్తగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోందని హిమంత ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. దేశంలో అస్థిరతను ప్రేరేపించే వ్యక్తుల్ని కలుసుకునేందుకు ఆయన వియత్నాం వెళ్లారని బీజేపీ నేతలు ఆరోపించారు.