GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?

  • భారత్‌కు భారీ వరద ముప్పు?
  • హిమాలయాల్లో 200 ప్రమాదకర సరస్సులు గుర్తింపు
Himalayan Flood Threat

Himalayan Flood Threat

Himalayan Flood Threat: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు మరోసారి హిమాలయ ప్రాంతాల్లోని హిమానీనద సరస్సులపై ఆందోళనలను పెంచాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమానీనదం విస్ఫోటనం కారణంగా భోటేకోశి, త్రిశూలి నదుల్లో భారీగా వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలు, టిబెట్‌లో నదీ మూల ప్రాంతానికి సమీపంలో కొత్తగా తాత్కాలిక సరస్సు ఏర్పడటంతో భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ పెరిగినట్లు సమాచారం. దీంతో దిగువ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. నేపాల్‌లో జరిగిన ఈ ఘటనతో ఇప్పుడు భారత హిమాలయ ప్రాంతాల్లో ఉన్న హిమానీనద సరస్సుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌లో వేలాది హిమానీనద సరస్సులు

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సీనియర్ సలహాదారు డాక్టర్ భూపేంద్ర మిలి తెలిపిన వివరాల ప్రకారం, భారత హిమాలయ ప్రాంతంలోని 11 నదీ పరీవాహక ప్రాంతాల్లో సుమారు 28,000 హిమానీనద సరస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 7,500 సరస్సులు భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. ఒక్క గంగా నదీ పరీవాహక ప్రాంతంలోనే 4,700కు పైగా హిమానీనద సరస్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే వీటిలో కొన్ని సరస్సులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. NDMA సుమారు 195 నుంచి 200 సరస్సులను అధిక ప్రమాదం ఉన్న ‘A కేటగిరీ’ సరస్సులుగా గుర్తించినట్లు సమాచారం.

హిమానీనద సరస్సులు ఎందుకు ప్రమాదకరం?

హిమానీనదాల కరిగే ప్రక్రియలో ఏర్పడే సరస్సుల్లో భారీ మొత్తంలో నీరు నిల్వ ఉంటుంది. వీటిని నియంత్రించే సహజ మంచు, రాళ్లు లేదా మట్టి అడ్డంకులు బలహీనపడితే ఒక్కసారిగా నీరు బయటకు దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనినే Glacial Lake Outburst Flood (GLOF) అంటారు. భారీ వర్షాలు, హిమానీనదాల కరుగుదల, కొండచరియలు విరిగిపడటం, భూకంపాలు వంటి కారణాలతో సరస్సు అడ్డంకులు తెగిపోతే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు, మట్టి కొట్టుకురావచ్చు. అందుకే ప్రమాదకర హిమానీనద సరస్సులను నిపుణులు కొన్నిసార్లు ‘వాటర్ బాంబ్స్’గా అభివర్ణిస్తారు.

నేపాల్‌లో విధ్వంసం ఎందుకు పెరిగింది?

నేపాల్‌లోని ఘటనలో సహజ పరిస్థితులతో పాటు మానవ కార్యకలాపాలు కూడా నష్టాన్ని పెంచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. టిబెట్, నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం, నదుల సహజ ప్రవాహ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పడటం వంటి కారణాలు ప్రమాద తీవ్రతను పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా, Early Warning System (EWS) సకాలంలో పనిచేయకపోతే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు తగినంత సమయం లభించదు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

భారత్‌లో ఏ రాష్ట్రాలకు ముప్పు?

భారత హిమాలయ ప్రాంతంలోని ప్రమాదకర హిమానీనద సరస్సులు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్- 48 – సట్లెజ్, బియాస్, చెనాబ్
సిక్కిం- 40 -తీస్తా బేసిన్
లడఖ్- 35 – సింధు, జాన్స్కార్
అరుణాచల్ ప్రదేశ్- 28 -దిబాంగ్, సుబన్సిరి
జమ్మూ & కాశ్మీర్ -26 జీలం, చెనాబ్
ఉత్తరాఖండ్ -13 -అలకనంద, భాగీరథి

మొత్తంగా 195-200 వరకు అధిక ప్రమాద సరస్సులను గుర్తించినట్లు సమాచారం.

ఉత్తర భారత మైదాన ప్రాంతాలకు కూడా ముప్పు

హిమాలయ ప్రాంతాల్లోని సరస్సులు పొంగిపొర్లితే ప్రభావం కేవలం పర్వత ప్రాంతాలకే పరిమితం కాకపోవచ్చు. భారీ మొత్తంలో నీరు, మట్టి, రాళ్లు దిగువకు ప్రవహించి నదుల నీటిమట్టాన్ని ఒక్కసారిగా పెంచవచ్చు. ప్రత్యేకంగా నేపాల్ లేదా సిక్కిం ప్రాంతాల్లో భారీ GLOF సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా నీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉంటుంది. దీంతో ఉత్తర బీహార్‌లోని సుపాల్, సహర్సా, మధుబని, చంపారన్ వంటి ప్రాంతాలు, అలాగే ఉత్తర బెంగాల్‌లోని జల్పైగురి, సిలిగురి, డార్జిలింగ్ టెరాయ్ ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉంది.

ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్యలు

ప్రమాదకర సరస్సులను పర్యవేక్షించేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

1. ప్రమాద మండలాల మ్యాపింగ్:
అధిక ప్రమాదం ఉన్న సరస్సుల చుట్టూ ప్రమాద ప్రాంతాలను గుర్తించి, అక్కడ కొత్త నిర్మాణాలు, నివాసాలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

2. ఇంజనీరింగ్ చర్యలు:
సరస్సుల్లోని నీటిని సురక్షితంగా బయటకు పంపేందుకు చెక్‌డ్యామ్‌లు, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి మళ్లింపు నిర్మాణాలు వంటి చర్యలను పరిశీలిస్తున్నారు.

3. ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థ:
అధిక ప్రమాదం ఉన్న సరస్సుల్లో ఆటోమేటిక్ ముందస్తు హెచ్చరిక సెన్సార్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయి. నీటి మట్టం, ఉష్ణోగ్రత, ఇతర మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

4. ఉపగ్రహ పర్యవేక్షణ:
24 గంటల ఉపగ్రహ పర్యవేక్షణ ద్వారా సరస్సుల పరిమాణం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల్లో మార్పులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వచ్చే రెండేళ్లలో కీలక మార్పులు?

అధిక ప్రమాదం ఉన్న హిమానీనద సరస్సుల వద్ద రాబోయే రెండేళ్లలో ఆటోమేటిక్ ముందస్తు హెచ్చరిక సెన్సార్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైతే ఖాళీ చేయించడం సులభమవుతుంది.

నేపాల్ ఘటన భారత్‌కు హెచ్చరికేనా?

నేపాల్‌లో జరిగిన వరదలు హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎంత వేగంగా భారీ విపత్తులుగా మారగలవో మరోసారి చూపిస్తున్నాయి. ముఖ్యంగా హిమానీనద సరస్సుల సంఖ్య, వాటి నీటి నిల్వ సామర్థ్యం, వాతావరణ మార్పుల ప్రభావం, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న నిర్మాణాలు వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. హిమాలయాల్లోని హిమానీనద సరస్సుల ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తే, పర్వత ప్రాంతాలతో పాటు దిగువ మైదాన ప్రాంతాల్లోనూ భారీ వరదలు సంభవించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఉపగ్రహ పర్యవేక్షణ, ప్రమాద మ్యాపింగ్, శాస్త్రీయ ఇంజనీరింగ్ చర్యలు అత్యంత కీలకంగా మారుతున్నాయి.