NTV Telugu Site icon

Train Accident: ఉత్తరాఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్ వైర్.. తప్పిన పెను ప్రమాదం

Uttarkhand

Uttarkhand

Train Accident: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఖతిమా రైల్వే స్టేషన్‌ను సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న వైర్‌ను తొలగించడంతో రైలు ముందుకు వెళ్లింది.

Read Also: Diwali Celebration Date Controversy: దీపావళి ఏ రోజు జరుపుకోవాలి..? పంచాంగ కర్తల మధ్య వివాదం..

ఇక, ఈ విషయానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఉత్తరాఖండ్ పోలీసుల సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఖతిమా స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుంచి వెళ్లిన కాసేపటికే లోకో పైలట్‌లు రైలును నిలిపివేసి.. తమకు సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. తక్షణమే సంఘటన ప్రదేశానికి వెళ్లి ఆ హైటెన్షన్ వైర్ ను తొలగించి ట్రైన్ ముందుకు వెళ్లేలా చేశామన్నారు. అయితే, ఈ ఘటనకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

Read Also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..

కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలను ఉంచడం వంటి చర్యలు తరచుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్లు అప్రమత్తతో అనేక ప్రమాదాలను నిరోధించగలిగారు. అలాగే, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై ప్రత్యేక నిఘా పెట్టారు.